మహిళా రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాల్సిందే!

15 Jun, 2014 01:36 IST|Sakshi

జేడీ(యూ) డిమాండ్

 న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్సీ, ఓబీసీలకు ఉపకోటా కల్పించాలంటున్న బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్ సరసన జేడీ(యూ) కూడా చేరింది. ఈ అంశంపై అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ చేసిన డిమాండ్‌కు జేడీ(యూ) పూర్తిగా మద్దతిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి శనివారం తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా బిల్లులో ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఉప కోటా ఇవ్వాలన్న అంశానికి తాము సానుకూలమని అనుప్రియా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మహిళా బిల్లుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 9న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందులో ఉపకోటా కల్పించాలని అనుప్రియ వ్యాఖ్యానించారు. తాజాగా మహిళా కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపకోటా కల్పించడం సమర్థనీయమేనని త్యాగి స్పష్టంచేశారు. గతంలో బీజేపీ నేత ఉమాభారతి కూడా ఇదే తరహా డిమాండ్‌ను ప్రస్తావించారని, అలాగే బీజేపీ నేత గోపీనాథ్ ముండే సైతం కోటాలో ఉపకోటా కల్పించాలని డిమాండ్ చేశారని త్యాగి గుర్తుచేశారు.
 

మరిన్ని వార్తలు