యువతపై లాబీ కన్ను...

31 May, 2020 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: పొగాకు లాబీ కన్ను ఇప్పుడు యువతపై పడింది. వారిని ఎలాగైనా పొగాకుకు బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ సిగరెట్లలో యువతకు నచ్చే రుచి, వాసనలు చేర్చడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది. పీచు మిఠాయి, బబుల్‌గమ్, చెర్రీ పండ్ల రుచి వాసనలతో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యానికి చేసే హానిని కాదని.. యువత పొగాకును ఎక్కువగా వినియోగిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా. అంతేకాదు.... యూఎస్‌బీ డ్రైవ్, ఐస్‌క్యాండీ వంటి ఆకారాల్లో పొగాకు ఉత్పత్తులను సిద్ధం చేసి మరీ యువతకు గాలమేస్తున్నారు. (కరోనాకు ధూమపానం మంచిదేనట!)

శుద్ధమైనవి, తక్కువ హాని చేసేవన్న లేబుళ్లు తగిలించడం వెనుక కూడా పరిశ్రమ హస్తం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. చాలా దేశాల్లో టెలివిజన్, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో పొగాకు ప్రకటనలివ్వడంపై నిషేధం ఉన్న నేపథ్యంలో కంపెనీలు యూటూబర్లు, ఇతర సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్షర్లు (ప్రభావం చూపగలవారు)తో పరోక్షంగా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నట్లు, తద్వారా 18 ఏళ్ల లోపు వయసు వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. (ఊపిరాడటం లేదు..!!)

యువత ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల అమ్మకం చేపట్టడం, తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ అమ్మే చోట పొగాకు ఉత్పత్తుల ప్రచారం, సిగరెట్లు విడిగా అమ్మడం, పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు ప్రభుత్వాలు చేసే అన్ని రకాల ప్రయత్నాలపై కొర్రీలు వేస్తూ వాటి అమలును జాప్యం చేయడం వంటివి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి. ఈ ఎత్తుగడలన్నింటినీ చిత్తు చేసే లక్ష్యంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘నో టొబాకో డే’ ఇతివృత్తంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. కంపెనీల కుటిలయత్నాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘రహస్యం బట్టబయలు’ అన్న శీర్షికతో ప్రచార సామగ్రిని సిద్ధం చేసింది.   

ఆదాయానికి.. అలవాట్లకు లింకు
ధూమపానం అలవాటయ్యేందుకు వ్యక్తులు, దేశాల ఆదాయానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ధనిక దేశాల్లో పొగతాగే వాళ్లు ఎక్కువగా ఉండటం దీనికి నిదర్శనం. అయితే అలవాట్లు మారేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టడం లేదు. 2000 సంవత్సరంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో దాదాపు 38 శాతం మంది పొగరాయుళ్లు ఉండగా... తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు ఇది 22 శాతానికి తగ్గిపోయింది. ఇలాంటి హెచ్చుతగ్గులు చాలాదేశాల్లో కనిపిస్తాయి.  

ధూమపానం మానేస్తే...
పొగ తాగడం వల్ల రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వీటిల్లో చాలావరకూ రక్తంలోని ఆక్సిజన్‌ను హరించేవే. పొగతాగడం మానేసిన తరువాత కొంత కాలానికే రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా మరింత శక్తి, ఉత్సాహం లభిస్తాయి. అలాగే ఆహారపు రుచి తెలిసేలా చేసే టేస్ట్‌ బడ్స్‌ మళ్లీ చురుకుగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో తినే తిండి రుచి, వాసనలు స్పష్టంగా తెలుస్తాయి. పొగాకు కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన గార, రసాయనాలు క్రమేపీ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించదు. అంతేకాదు.. పోషకాలు అందడం ఎక్కువ కావడం వల్ల చర్మంపైని ముడుతలు తగ్గుతాయి. 

మరిన్ని వార్తలు