వి‘జేఈఈ’భవ!

20 May, 2018 01:10 IST|Sakshi

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 

9 గంటలకు పేపర్‌–1 పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 20న నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలని పేర్కొంది. అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించింది. నిర్ణీత సమయం తర్వా త నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు 2,31,024 మందికి అర్హత కల్పిస్తే.. 1,64,822 మందే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

విద్యార్థులు ఇవి తీసుకెళ్లవద్దు.. 
బ్రాస్‌లెట్, ఇయర్‌ రింగ్స్, నోస్‌ పిన్, చైన్, నెక్లెస్‌ వంటి ఆభరణాలు, హెయిర్‌పిన్, హెయిర్‌ బ్యాండ్‌ వంటివి ధరించకూడదు. పర్సులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, హ్యాండ్‌ బ్యాగులు, వాచీలు, క్యాలికులేటర్, అద్దాలు, సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. 

విద్యార్థులు పాటించాల్సినవి.. 
విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ జిరాక్స్, ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, కాలేజీ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డు) వెంట తెచ్చుకోవాలి. ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. 

పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లాక బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌/వెరిఫికేషన్‌ చేయించుకోవాలి.  వెరిఫికేషన్‌ తర్వాత 7:45 గంటలకు పేపర్‌–1 పరీక్షకు, మధ్యాహ్నం 12:45 గంటలకు పేపర్‌–2 పరీక్ష కోసం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.

తొలుత కంప్యూటర్‌ స్క్రీన్‌పై పేరు, ఫొటో, రోల్‌నంబర్‌ కనిపిస్తుంది. అభ్యర్థులు లాగిన్‌ అయ్యాక ముందుగా సూచనలు చదువుకోవాలి

జోన్ల వారీగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థులు 

జోన్‌                       విద్యార్థుల సంఖ్య 
ఐఐటీ బాంబే                28,813 
ఐఐటీ ఢిల్లీ                   31,884 
ఐఐటీ గౌహతి              11,907 
ఐఐటీ కాన్పూర్‌           20,428 
ఐఐటీ ఖరగ్‌పూర్‌        19,145 
ఐఐటీ మద్రాసు           38,231 
ఐఐటీ రూర్కీ             14,414 
మొత్తం                  1,64,822   

మరిన్ని వార్తలు