మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

15 Jan, 2016 17:03 IST|Sakshi
మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

శబరిమల యాత్ర చివరి రోజైన శుక్రవారం పొన్నాంబళంమేడు కొండల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనమీయనుంది. జ్యోతి రూపంలో దర్శనమీయనున్న అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమల చేరుకున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శబరిమల దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతంలో తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దేవస్ధాన పరిసరాలు, పంపా తీరం వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేశారు.

భక్తులకు కావల్సిన ఆహారం, మంచినీటిని ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు మరకజ్యోతి దర్శనానికి వస్తారని అంచనా. అయితే ప్రతి ఏడాదీ జనవరి 14న దర్శనమిచ్చే అయ్యప్ప మకరజ్యోతి ఈ సారి జనవరి 15వ తేదీ సాయంత్రం దర్శనమివ్వనుంది. కేరళ ప్రభుత్వం నిర్వహించే అయ్యప్ప ఆలయ అధికారిక వెబ్ సైట్ ఈ విషయాన్ని ప్రకటించింది.

మలయాళ పంచాంగం ప్రకారం మకర సంక్రమణ పూజ ఈసారి జనవరి 14 అర్ధరాత్రి 12.58 గంటలకు జరుగుతుంది. అందువల్ల మకర జ్యోతి మరుసటి రోజున వుంటుందని తెలిపారు. జనవరి 15 న జరిగే మకర జ్యోతి దర్శనం చాలా అరుదుగా వస్తుందని. మండల దీక్ష తీసుకొని అయ్యప్ప మకర జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి కంఠరాయ మహేశ్వరాయ తెలిపారు.  

మరిన్ని వార్తలు