నేడు రెండో విడత ఎన్నికలు

2 Dec, 2014 05:36 IST|Sakshi
  • కశ్మీర్‌లో 18, జార్ఖండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
  • శ్రీనగర్/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీల రెండో విడత ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. కశ్మీర్‌లో 18, జార్ఖండ్‌లోని 7 నక్సల్స్ ప్రభావిత గిరిజన జిల్లాల్లోని 20 స్థానాలకు పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ విడతలో రెండు రాష్ట్రాలతో కలిపి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఏడుగురు రాష్ట్ర మంత్రులు, ఓ మాజీ కశ్మీర్ వేర్పాటువాద నేత భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. జమ్మూ ప్రాంతంలోని రెండు జిల్లాలు, కశ్మీర్ లోయలోని ఐదు జిల్లాల్లో ఉన్న 18 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.

    మొత్తం 87 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గత నెల 25న 15 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదయింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్‌గనీ ఈ విడతలో హంద్వారా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 12 లక్షల మంది ఓటేయనున్నారు.

    ఇక, 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 233మందిలో మాజీ సీఎంలు అర్జున్ ముండా, మధు కోడా ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు మొత్తం 20 స్థానాల్లో, బీజేపీ 18 చోట్ల, దాని మిత్రపక్షం అజ్సూ పార్టీ రెండు చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాయి. 44 లక్షల మంది ఈ విడతలో ఓటేయనున్నారు. జార్ఖండ్ లో గ త నెల 25న  13 స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదైంది.
     

మరిన్ని వార్తలు