అచ్చం చిన్ని కృష్ణుడి లాగే!

18 May, 2016 11:15 IST|Sakshi
అచ్చం చిన్ని కృష్ణుడి లాగే!

మహాభారతంలో చిన్నికృష్ణుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి అల్లరి చేస్తున్నాడని తల్లి యశోద నడుముకి తాడుకట్టి, దాని రెండో కొసను ఓ రోలుకు కడుతుంది. అహ్మదాబాద్‌లో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి కనిపించింది. 15 నెలల శివాని అనే అమ్మాయిని ఆమె తల్లి ఒక బండరాయికి ప్లాస్టిక్ టేపుతో కట్టేసింది. ఆమె తల్లి నగరంలోని ఒక భవన నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తోంది. తాను పని చేసుకుంటున్నప్పుడు చిన్నారిని చూసుకోడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం.. నిర్మాణ స్థలం వద్ద శివాని అటూ ఇటూ తిరిగితే ఏదైనా ప్రమాదానికి గురవుతుందేమోనన్న ఆందోళన ఆ తల్లితో తన కూతురిని అలా కట్టేయించాయి. విద్యుత్ కేబుళ్లు వేయడానికి గుంతలు తవ్వేపనిలో శివాని తల్లి దండ్రులు ఇద్దరూ అక్కడ పనిచేస్తారు. ఇద్దరికీ కలిపి రూ. 500 వస్తాయి.

నిర్మాణ ప్రాంతం వద్ద జనం అటూ ఇటూ తిరుగుతుంటారు, భారీ యంత్రాలు కూడా పనిచేస్తాయి. రాళ్లు, రప్పలు పడుతుంటాయి. తన కొడుకు వయసు మూడున్నరేళ్లని.. అతడు తన చెల్లెలిని అటూ ఇటూ వెళ్లకుండా ఆపలేకపోతున్నాడని.. అందుకే కూతుర్ని కాపాడుకోడానికి తనకు అంతకంటే మార్గం కనిపించలేదని ఆమె తల్లి చెప్పింది. అక్కడ అలాంటి చాలామంది పిల్లలు దుమ్ములో,  ఎండలో ఆడుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్లకు కనీసం నిలువ నీడ కూడా కల్పించడం లేదు. పోనీ పిల్లలను ఎక్కడైనా క్రష్‌లలో పెడదామంటే, అందుకు చాలా ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి గానీ, నిర్మాణ సంస్థల వైపు నంచి గానీ ఇలాంటి పిల్లలను సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేవరకు పిల్లలు తమవద్దే ఉంటారని, ఆ తర్వాత వాళ్లను తాత ఇంటికి పంపేసి తాము పనుల్లోకి వెళ్తామని అక్కడ పనిచేసుకునే కూలీలు చెప్పారు. అందుకే ఇలాంటి చిన్నికృష్ణులు ఎంతోమంది అక్కడ కనిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు