మళ్లీ టోల్‌ ఫీజు మోత!

20 Apr, 2020 17:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్‌గేట్‌ గేట్ల వద్ద ఫీజుల వసూలు మళ్లీ మొదలయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో టోల్‌ ప్లాజాల వద్ద సోమవారం నుంచి మళ్లీ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టోల్‌ ఫీజుల వసూళ్లపై కేంద్ర హోం శాఖ మార్చి 25న తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు మళ్లీ టోల్‌ ఫీజులు వసూలు చేస్తున్నట్టు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ), హైవేస్‌ డెవలపర్స్‌ వెల్లడించాయి. లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. టోల్‌ ఫీజు వసూలు సందర్భంగా జాగ్ర‍త్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. సిబ్బందికి సరిపడా గ్లోవ్స్‌, మాస్క్‌లు, శానిటైజర్లు అందించినట్టు చెప్పాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తివేయకుండా టోల్‌ ఫీజు వసూలు చేయడాన్ని  ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) వ్యతిరేకించింది. రబీ వ్యవసాయోత్పత్తుల సేకరణపై ఈ చర్య తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. లాక్‌డౌన్‌తో 85 శాతం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిపై టోల్‌ ఫీజు భారం మోపడం సరికాదని తెలిపింది. 

ఒకే వేదికపై మోదీ, పోప్‌.. ఇదెలా సాధ్యం!

మరిన్ని వార్తలు