జమ్మూకశ్మీర్లో టోల్‌ ట్యాక్స్‌ రద్దు

1 Jan, 2020 05:01 IST|Sakshi

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో టోల్‌ రుసుమును రద్దు చేశారు. జమ్మూ– పఠాన్‌కోట్‌ రహదారిలోని లఖన్‌పూర్‌ పోస్ట్‌ సహా జమ్మూ కశ్మీర్లోని మొత్తం టోల్‌ పోస్ట్‌ల వద్ద రుసుముల వసూలును జనవరి 1వ తేదీ నుంచి నిలిపివేస్తున్నామని అభివృద్ధి, పర్యవేక్షణ విభాగాల ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రోహిత్‌ కన్సల్‌ మంగళవారం ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు సహా అన్ని టోల్‌ పోస్ట్‌ల్లో  ట్యాక్స్‌ వసూలు చేయబోమన్నారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ. 1500 కోట్ల నష్టం వాటిల్లుతుంది.

ఇంటర్నెట్‌ సర్వీసుల పునరుద్ధరణ 
నాలుగున్నర నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సర్వీసుల్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దుకు ఒక్క రోజు ముందు ఆగస్టు 4 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్‌లైన్‌ సేవలను యంత్రాంగం నిలిపివేసింది.  మొబైల్‌ వినియోగదారులందరికీ ఎస్‌ఎంఎస్‌లు పంపే సదుపాయాన్ని పునరుద్ధరించినట్టుగా అ«ధికారులు తెలిపారు.

160 మంది ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో 2019లో 160 మంది ఉగ్రవాదులు బలగాల చేతుల్లో హతం కాగా 102 మందిని అరెస్టు చేశామని డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. లోయలో ఇప్పటికీ 250 మంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని మంగళవారం వెల్లడించారు. 

మరిన్ని వార్తలు