మహాసంగ్రామానికి సర్వం సిద్ధం

13 Oct, 2014 23:49 IST|Sakshi
మహాసంగ్రామానికి సర్వం సిద్ధం

రేపే పోలింగ్
* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
* నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే
* ఫొటో గుర్తింపు కార్డులుగా దేనినైనా తీసుకెళ్లవచ్చు

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోసం రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకుగాను ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గడ్చిరోలి జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమయంలో హైఅలర్ట్ ప్రకటించారు. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 8,25,91,826 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  
 
తీవ్ర ఉత్కంఠత...
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి గట్టి పోటీ కన్పిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగా బరిలోకి దిగడంతో అధికారంలోకి ఎవరు వస్తారనే విషయంపై ప్రజల్లో ఉత్కంఠత కన్పిస్తోంది. అన్ని పార్టీలు రాష్ట్రంలో తమదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.  
 
పోలీస్‌లకు సవాల్...
రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు పోలీసులకు సవాల్‌గా మారాయి. విదర్భలోని అనేక జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకిదిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఈసారి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడం సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులుండవని శాంతియుతంగా జరుగుతాయన్న ధీమా అందరిలో వ్యక్తమవుతోంది.
 
ఈ నెల 19న ఓట్ల లెక్కింపు...
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి ఎవరు రానున్నారు? ఎవరు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది దీపావళికి ముందే తేలనుంది. బుధవారం పోలింగ్ అనంతరం 19వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది. దీపావళి పండుగ  23వ తేదీ ఉండడంతో  దీపావళి పండుగకు ముందే రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రానున్నరనే విషయం తేలనుంది. ఇదిలావుండగా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం సెలవు దినంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు