రూ. 500 చెక్కు..ఆనందంలో ఐజీ!

10 Aug, 2019 11:15 IST|Sakshi

లక్నో : ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందినా లభించని సంతోషం కేవలం రూ. 500ల చెక్కులో దొరికిందని సతీశ్‌ గణేష్‌ అనే పోలీసు అధికారి హర్షం వ్యక్తం చేశారు. ఓ సాధారణ పౌరుడు రాసిన లేఖ చూసి ఇంతవరకు తాను అందుకున్న ప్రశంసల్లో ఇదే గొప్పదని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న సతీశ్‌కు విజయ్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి గురువారం లేఖ రాశాడు. ప్రశంసా ప్రమాణ పత్ర పేరిట రాసిన ఆ లేఖలో...‘ పేదవాళ్లను అవమానించడం, వారి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో అలసత్వం వహించే ఎంతో మంది పోలీసులను రోజూ చూస్తుంటాం. కానీ మీరు అలా కాదు. మీ పనితనం నాకెంతగానో నచ్చింది. అందుకే ఉత్తరంతో పాటు రూ. 500 చెక్కును జత చేస్తున్నాను’ అని ఇటాకు చెందిన విజయ్‌పాల్‌ పేర్కొన్నాడు.

ఈ క్రమంలో సతీశ్‌ మాట్లాడుతూ..తన 23 ఏళ్ల కెరీర్‌లో అందుకున్న అత్యుత్తమ ప్రశంస ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఎన్నెన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందానని.. అయితే విజయ్‌పాల్‌ లేఖ తనకు బంగారు పతకంతో సమానం అన్నారు. ఎవరి రక్షణ కోసమైతే అహర్నిశలు శ్రమిస్తున్నామో.. అటువంటి ప్రజల నుంచి ఇలాంటి కితాబులు అందుకున్నప్పుడు అలసటను మర్చిపోతామని పేర్కొన్నారు. ఉన్నత అధికారులతో పాటు ప్రజల నుంచి కూడా ఇలాంటి ప్రోత్సాహం అందితే..ఏ అధికారికైనా మరింత అంకితభావంతో పనిచేయాలనే భావన కలుగుతుందన్నారు. యువ పోలీసులకు స్ఫూర్తి అందించే విజయ్‌పాల్‌ లేఖను, చెక్కును లామినేషన్‌ చేయించి తన కార్యాలయంలో భద్రపరుస్తానని వెల్లడించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా