ప్రమోషన్లకు అర్హతే ప్రామాణికం: సుప్రీంకోర్టు కొలీజియం

9 May, 2019 11:41 IST|Sakshi

కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు కొలీజియం

సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు జడ్జిల పదోన్నతి విషయంలో కేంద్రం అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌,  జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని తిరిగి న్యాయశాఖకు సిఫార్సు చేసింది. జార్ఖండ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌, గౌహతి హైకోర్టు సీజే జస్టిస్ ఏఎస్‌ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలంటూ ఏప్రిల్ 12న కొలిజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

అయితే సీనియారిటీ, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రీజియన్ కారణాలుగా పేర్కొంటూ... ఈ ఇద్దరి ప్రమోషన్‌ను న్యాయశాఖ తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన కొలిజియం.. పదోన్నతికి అర్హతే ప్రామాణికమని స్పష్టం చేసింది. జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌, జస్టిస్‌ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదిచింది. అలాగే, బోంబే హైకోర్టు జడ్జ్‌ జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్‌ సహా మొత్తం 31మంది న్యాయమూర్తులకు చోటుంది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో 27మంది జడ్జిలున్నారు.

>
మరిన్ని వార్తలు