ఎమ్మెల్యేకు సీజేఐ కథ, జరిమానా

10 Feb, 2017 19:14 IST|Sakshi
న్యూఢిల్లీ: 23 సంవత్సరాల క్రితం ఓ మేగజిన్‌లో రాసిన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రధాన న్యాయమూర్తి భారీగా జరిమానా విధించారు. బీహార్‌లోని ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రవీంద్ర సింగ్‌ 1994లో తనపై నియచక్ర మేగజిన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సీజేఐ జేఎస్‌ ఖెహర్‌.. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టులో పిటిషన్‌ వేయడంపై రవీంద్రను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇచ్చిన రవీంద్ర.. 2013లో తాను ఆ ఆర్టికల్‌ను చదివానని చెప్పారు. 
 
పాట్నా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా... కోర్టు పిటిషన్‌ను తీసుకునేందుకు తిరస్కరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానానికి తృప్తి చెందని న్యాయమూర్తి పిటిషన్‌ అమూల్యమైన కోర్టు సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ప్రజాప్రతినిధి ఉండి చట్టాన్ని దుర్వినియోగం చేయాకూడదని వ్యాఖ్యానించారు. ఏళ్ల తర్వాత పిటిషన్‌ను ఫైల్‌ చేసినందుకు పిటిషనర్‌కు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నివ్వెరపోయిన రవీంద్రసింగ్‌ జరిమానాను రద్దు చేయాలని కోరారు. రవీంద్ర అభ్యర్ధనపై స్సందించిన సీజేఐ.. తాను విద్యార్థి దశలో ఉన్న సమయంలో హాస్టల్‌లో జరిగిన ఓ సంఘటను చెప్పారు.
 
హాస్టల్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ విద్యార్థికి రూ.25 జరిమానా విధించారని చెప్పారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు తక్కువ జరిమానా విధించింనందుకు సదరు విద్యార్థి వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జి చెప్పిన కథతో కోర్టులో నవ్వులు పూశాయి. ఆ విద్యార్థిలాగే రవీంద్ర కూడా రూ.10 లక్షల జరిమానాకు ఇంకొంచెం ఎక్కువ చెల్లించాలని న్యాయమూర్తి అన్నారు.
>
మరిన్ని వార్తలు