మహారాష్ట్ర వైఖరిని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

10 Jul, 2020 09:36 IST|Sakshi

న్యూఢిల్లీ: వలస కార్మికుల సమస్యపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వలస కార్మికులకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి సమస్యా లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరిస్తూ, వలస కార్మికుల ఇబ్బందులను గుర్తించి, పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని నొక్కి చెప్పింది. వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్, ఎస్‌.కె.కౌల్, ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులెదుర్కొన్న సమస్యలను సుమోటోగా తీసుకుని, విచారించిన కోర్టు ‘మహారాష్ట్రలో ఇప్పటికీ వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళేందుకు ఎదురుచూస్తున్నారనీ, అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?’ అని ప్రశ్నించింది. గతంలో వారి స్వరాష్ట్రాలకు వెళ్ళిపోవాలనుకున్న వలస కార్మికులు సైతం, తిరిగి ఉపాధి అవకాశాలకోసం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా కోర్టుకి వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణను జూలై 17కి కోర్టు వాయిదా వేసింది. (రాజకీయం చేయొద్దు.. అందుకే ఈ చర్య..)

మరిన్ని వార్తలు