నితీష్‌ సర్కార్‌పై సుప్రీం సీరియస్‌

27 Nov, 2018 12:59 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కేసులో బిహార్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్‌ బాలికలపై లైంగిక దాడి జరిగితే ఆ కేసులను కేవలం పోక్సో చట్టం కింద మాత్రమే నమోదు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించింది. మత్తు మందు ఇచ్చి మరీ అత్యాచారం జరిపిన హేయమైన ఘటనపై భారత శిక్షా స్మృతి ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ నితీష్‌ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది.

మంగళవారం ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘ఈ కేసుల్లో బిహార్‌ ప్రభుత్వం కేవలం ప్రాథమిక విచారణ చేపడితే సరిపోదు. సెక్షన్‌ 377 కింద కేసు నమోదు చేయనట్లయితే విచారణ ముందుకు ఎలా సాగుతుంది. పిల్లలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపితే మీరేమో సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అమానుషం. ఆ పిల్లలకు మనం న్యాయం చేయలేమా. అంటే ఈ దేశంలో పిల్లల్ని పౌరులుగా పరిగణించడం లేదా’  అని  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన బిహార్‌ ప్రభుత్వ లాయర్‌ మాట్లాడుతూ.. షెల్టర్‌ హోం అకృత్యాలపై నమోదు చేసిన కేసులను సవరించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు