ఫౌజీ భాయ్‌ ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్‌!

3 Jun, 2020 14:55 IST|Sakshi

శ్రీనగర్‌: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్‌ అలియాస్‌ అబ్దుల్‌ రెహమాన్‌ కూడా ఉన్నట్టు కశ్మీర్‌ రేంజ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఫౌజీ భాయ్‌ ఎన్‌కౌంటర్‌ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్‌ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 
(చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!)

కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్‌ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్‌ అహ్మద్‌ దార్‌ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్‌ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్‌ దార్‌కు సమీర్‌ అహ్మద్‌ దార్‌ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. 
(చదవండి: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌)

మరిన్ని వార్తలు