'వైఫ్ స్వాపింగ్' కేసులో దంపతులకు ఊరట

5 Jul, 2016 17:55 IST|Sakshi
'వైఫ్ స్వాపింగ్' కేసులో దంపతులకు ఊరట

భువనేశ్వర్: ఒడిశాలో ప్రముఖ పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈ నెల 29 వరకు అరెస్టు చేయవద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అత్తింటి వారు వేధిస్తున్నారని త్రైలోక్య మిశ్రా  కోడలు లోపముద్ర మిశ్రా స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
 
అత్త, మామలు, భర్త అరెస్టులో జాప్యం చేస్తే తనకు, తన బిడ్డకు ప్రాణాపాయం ముంచుకు వస్తుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు.  కాగా, పారిశ్రామికవేత్త త్రైలోక్య మిశ్రా దంపతులు, ఆయన కుమారుడిని ఈనెల 29 వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా కోర్టులో పోలీసులు కేసు డైరీ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

పెళ్లయిన తొలి రోజుల నుంచి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని, భర్త వేధింపులకు అత్త, మామ పరోక్షంగా కొమ్ముకాసి తన సహనానికి పరీక్ష పెట్టినట్టు లోపముద్ర మిశ్రా అంతకుముందు ఆరోపించారు. హానీ మూన్ నేపథ్యంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైఫ్ స్వాపింగ్(భార్యల బదిలీ) కాలక్షేపానికి ఆమె నిరాకరించడంతో భర్త వేధింపులు ప్రారంభమైనట్టు తెలిపారు. 2006 సంవత్సరం జనవరి నెల 27వ తేదీన త్రైలోక్యనాథ మిశ్రా కుమారుడు సవ్యసాచి మిశ్రాతో వివాహం జరిగిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు