గజపతి జిల్లాలో..ప్రకృతి సోయగం

21 Aug, 2018 13:57 IST|Sakshi
చంద్రగిరి వద్ద టెబెటియన్‌ బౌద్ధమందిరం 

పర్లాకిమిడి ఒరిస్సా : గజపతి జిల్లాలో పలు చోట్ల దర్శనమిస్తున్న ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని ఆయా చోట్ల ఉన్న జలపాతాలు, జమీందారుల కాలం నాటి కట్టడాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు జిల్లాలో దాగున్న ప్రకృతి సోయగాలను చూసేందుకు పోటెత్తుతున్నారు.

జిల్లాలోని మహేంద్రగిరి పర్వతాలు, జిరంగోకు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బౌద్ధ మందిరం, గండాహతి జలపాతం, గుద్‌గుదా జలపాతం, సెరంగో ఘాట్‌ రోడ్‌ అందాలు, చంద్రగిరి టిబెటియన్‌ ప్రాంతంలో ఉన్న అనేక రకాల పండ్ల తోటలను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు తరచూ జిల్లాకు వస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దమని స్థానికులు కొన్నాళ్లుగా కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.  

పర్యాటక కేంద్రంతో జిల్లాకు మేలు

గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించి అభివృద్ధిపరిస్తే స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏటా మహేంద్రగిరి పర్వతం పైన ఉన్న శివుని, భీమ, కుంతి, యుధిష్టర ఆలయాలను శివరాత్రి రోజున భక్తులు తిలకించేందుకు పోటీపడతారు. వీటితో పాటు వివిధ పక్షుల కిలకిల రావాలు వినేందుకు, అక్కడి నుంచి ప్రకృతి సోయగాలకు వీక్షించేందుకు పర్యాటకులు నిత్యం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వచ్చే ఔత్సాహికులకు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి, గజపతి జిల్లాను అభివృద్ధి చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

ఆకర్షిస్తున్న మహేంద్రగిరి అందాలు

మహేంద్రగిరి పర్వతం సముద్ర మట్టానికి సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని మందస, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న శ్రీముఖలింగం వంటి శైవ మందిరాలు పర్యాటకులకు కనిపిస్తూ అబ్బురపరుస్తాయి. వేకువజామున కనిపించే మహేంద్రగిరి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు ఉదయమే మహేంద్రగిర ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో మహేంద్రగిరి పర్వతం నుంచి వచ్చే సూర్యోదయం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పర్వతం పైకి ట్రెకింగ్‌కు వెళ్లేందుకు వీలుగా ట్రెకింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని అప్పట్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉన్న సూర్యనారాయణ పాత్రో ప్రకటించారు.కానీ ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడం పట్ల జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు.

త్రీస్టార్‌ హోటల్‌ కోసం నిధులు కేటాయించినా.. 

వీటితో పాటు ప్రస్తుతం పర్లాకిమిడిలో ఉన్న బృందావన్‌ ప్యాలెస్‌ను త్రీస్టార్‌ హోటల్‌గా తయారు చేసేందుకు గతంలో పర్యాటక శాఖ రూ.లక్షల ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గజపతి జిల్లాలోని ఆయా పర్యాటక ప్రదేశాలు ఇప్పుడు ఒడిశా చలన చిత్ర మండలిని కూడా ఆకర్షించడంతో పలు సినిమాల షూటింగ్స్‌ కూడా ఇక్కడ జరుగుతుండడం విశేషం. జిల్లాలోని బీఎన్‌ ప్యాలెస్, గజపతి ప్యాలెస్‌లలో షూటింగ్స్‌ తరచూ జరుగుతుండడం విశేషం. 

ఊటీని తలపిస్తోన్న సెరంగో

పర్లాకిమిడికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెరంగో ప్రాంతం ఊటీని తలపించే రీతిలో అత్యద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కోయిపూర్‌–కించిలింగి రోడ్డు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖకు అప్పగించడంతో మరికొద్ది రోజుల్లోనే మహేంద్రగిరికి కారులో వెళ్లేందుకు వీలు కలుగుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వెలుస్తున్న రిసార్టులు, రెస్టారెంట్‌లు

పర్లాకిమిడికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండహతి జలపాతాల పక్కన పలు రిసార్టులు, రెస్టారెంటులు ఇప్పుడిప్పుడే వెలుస్తున్నాయి. ఇదే ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ వీఐపీ గెస్ట్‌హౌస్‌ కూడా నిర్మించారు. ఇదే మార్గంలో పర్లాకిమిడిని చేరుకోవడానికి విశాఖపట్నం, పూరీ, భువనేశ్వర్‌ నుంచి రైల్వే మార్గం కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం సులువేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతానికి ప్యాసింజర్‌ రైలుతో పాటు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం నడుస్తున్నాయి. 

పలుమార్లు విజ్ఞప్తి చేసినా..

గజపతి జిల్లాను పర్యాటక కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపరిస్తే జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాను పర్యాటక కేంద్రం చేయమని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించి, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ ప్రధానికి వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌

‘రఫేల్‌’లో ఏ కుంభకోణం లేదు 

కేంద్ర పథకాల అమలుపై సమీక్ష జరగాలి 

మంచుచరియలు పడి ఆరుగురు జవాన్ల మృతి

‘రక్షణ’లో పెట్టుబడులకు స్వాగతం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

గ్యాంగ్‌స్టర్‌ లవ్‌