పోతూపోతూ.. 2వేల టన్నుల చెత్తను వదిలివెళ్లారు

6 Jul, 2019 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ : మే-జూన్‌ నెలలో దాదాపు 10లక్షల మంది పర్యాటకులు మనాలిని సందర్శించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పోతూ పోతూ.. 2000 టన్నుల చెత్తను వదిలిపెట్టిపోయారట. ఈ చెత్తలోనూ ఎక్కువభాగం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా  మనాలిలో ప్రతిరోజు 10 టన్నుల చెత్త మాత్రమే బయటికి వస్తోందని, అయితే పర్యాటకులు అధికంగా వచ్చే సమయంలో మాత్రం రోజకు 35 టన్నుల చెత్త ఉత్పత్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు. రోహతంగ్‌ పాస్‌, సోలాంగ్‌ నుంచి మనాలికి వెళ్లే దారిలో ఉన్న హోటళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను దగ్గర్లోని బర్మానా సిమెంట్‌ ప్లాంట్‌కు తరలించి అక్కడే తగలబెడుతున్నారు. కానీ చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు.

'ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఒకేసారి 100 టన్నుల వ్యర్థాలను తగలబెట్టే సామర్థ్యం గల పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నార'ని మనాలి మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నారాయణ సింగ్‌ వర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ వచ్చే వారంలో ప్రారంభమమ్యే అవకాశం ఉందని, దీని వల్ల సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.  అత్యధికంగా వెలువడుతున్నచెత్త వల్ల బియాస్‌ నది, అలాగే పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా చూడాలని జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) కులు,మనాలి మున్సిపల్‌ విభాగాలను ఆదేశించింది. అయితే మనాలిలో స్థానిక జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు వేస్తున్న చెత్తే ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని వార్తలు