‘అమ్మ’ మరణంపై విచారణ కమిషన్‌

18 Aug, 2017 07:39 IST|Sakshi
‘అమ్మ’ మరణంపై విచారణ కమిషన్‌

► స్మారక మందిరంగా జయలలిత నివాసం
► అన్నా డీఎంకే వర్గాల విలీనం ఖరారు!  


సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి గురువారం న్యాయ విచారణకు ఆదేశించారు. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. జయ కన్నుమూసిన తరువాత ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో వాటి నివృత్తి కోసమే ఈ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పళనిస్వామి చెప్పారు. అలాగే జయలలిత నివసించిన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు.

సీఎంగా ఉండగానే గతేడాది సెప్టెంబరు 22న అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత... 75 రోజులు వైద్యశాలలోనే ఉండి డిసెంబరు 5న గుండెపోటుతో మరణించడం తెలిసిందే. మరోవైపు విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేయనుండటంతో అన్నా డీఎంకేలోని రెండు వర్గాల విలీనం దాదాపు ఖారరైంది. తన వర్గాన్ని విలీనం చేయాలంటే జయ మరణంపై విచారణ జరపాలనీ, వేద నిలయంను స్మారకమందిరంగా మార్చాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రధానంగా డిమాండ్‌ చేస్తూ వచ్చారు.

అయితే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా తొలగించినప్పుడే విలీనంపై ముందుకెళ్తామని పన్నీర్‌ సెల్వం సన్నిహితులు అంటున్నారు. జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ వర్గం తమకు లభించిన విజయంగా పేర్కొంది. జయ మరణానికి శశికళ కారణమని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కాగా, జయ మరణంపై విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

నాడు రూ.1.32 లక్షలు...నేడు రూ.72.09 కోట్లు
1967 మే 15న జయలలిత, ఆమె తల్లి వేద (తమిళ సినీరంగంలో సంధ్యగా ప్రాచుర్యం పొందారు) కలసి చెన్నైలో పోయెస్‌ గార్డెన్‌లో ఈ ఇంటిని రూ.1.32 లక్షలకు కొన్నారు. తల్లిపై ప్రేమను చాటుతూ జయ ఆ ఇంటికి వేద నిలయం అని పేరు పెట్టారు. జయ తన స్నేహితురాలు శశికళతో కలిసి ఇక్కడే మూడు దశాబ్దాలకు పైగా నివసిం చారు. జయ చనిపోయిన తర్వాత కూడా అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే వరకు శశికళ ఈ ఇంట్లోనే ఉన్నారు. గతే డాది అసెంబ్లీ ఎన్నికకు జయ నామినేషన్‌ వేసినప్పుడు ఇంటి విలువ 72.09 కోట్లని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు