ఆటో వార్డెన్!

10 Jul, 2014 00:50 IST|Sakshi
ఆటో వార్డెన్!

సాక్షి, చెన్నై: ఆటోలకు మీటర్లు తప్పని సరి చేయడం లక్ష్యంగా సరికొత్త పథకానికి నగర ట్రాఫిక్ యంత్రాంగం నిర్ణయించింది. ఆటో, క్రైం, ట్రాఫిక్ భాగస్వామ్యంతో ‘ఆటో వార్డెన్’ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. మీటర్లు వేయకున్నా, చార్జీల దోపిడీకి పాల్పడే ఆటోవాలాల భరతం పట్టడం లక్ష్యం గా ఈ బృందాలు రోడ్డెక్కనున్నారుు. ప్రధాన నగరాల్లో సాగుతున్న  ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో  చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటోల్లో మీటర్లు తప్పనిసరి చేసింది. కనీస చార్జీగా రూ.25, ఆ తర్వాత కిలో మీటరుకు రూ.12 వసూలు చేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. అలాగే, రాత్రుల్లో 50శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో ఆటో చార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే, మెజారిటీ శాతం ఆటోవాలాలు మాత్రం కుంటి సాకులతో మీటర్లు వేయడం మానేశారు. పలు చోట్ల ప్రయాణికుల నుంచి చార్జీల దోపిడీకి దిగుతూనే ఉన్నారు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీంతో ఆటో వాలాల భరతం పట్టే విధంగా ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు రోడ్డెక్కి జరిమానాల మోత మోగించారు. వందలాది ఆటోలను సీజ్ చేశారు. అయినా, వారిలో మార్పు రాలేదు. అదే సమయంలో అధికారుల తీరును నిరసిస్తూ రివర్స్ గేర్ బాటపట్టారు. తాము మీటర్లు వేస్తున్నా, అధికారులు పనిగట్టుకుని కేసులు వేస్తున్నారంటూ వాదించారు. తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గట్టుగా చార్జీల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. వీటన్నింటిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆటోలకు మీటర్లు వేయించడంలో ట్రాఫిక్, ఆర్టీఏ యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు ఎక్కడ కోర్టుకు చేరుతాయో, ఎక్కడ చీవాట్లు పడుతాయోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. దీంతో సరికొత్తగా ఆటో వాలాల వద్దకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

ఆటో వార్డెన్ అంటే..: ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఆటో వాలాల భరతం ఆటోవాలాల చేతే పట్టించేందుకు సిద్ధమయ్యారు. తాము పని గట్టుకుని కేసులు వేస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టే విధంగా కొత్త పథకాన్ని ట్రాఫిక్ యంత్రాంగం రచించింది. మహానగరంలో అదనపు కమిషనర్ పరిధిలో పన్నెండు డివిజన్లుగా ట్రాఫిక్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఉండే నిజాయితీ పరులైన, ఎలాంటి వ్యవసనాలు లేని ఆటో వాలాలను ఈ పథకానికి ఎంపిక చేయడానికి నిర్ణయించారు. దీనికి ఆటో వార్డెన్ అని నామకరణం చేశారు. ఒక్కో డివిజన్ పరిధిలో పది మంది చొప్పున నిజాయితీ పరులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేస్తారు. పన్నెండు డివిజన్లకు 120 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

పది మంది చొప్పున పన్నెండు ఆటో డ్రైవర్ల బృందాలను, ఒక్కో బృందానికి ఒక ట్రాఫిక్ పోలీసు, మరో క్రైం పోలీసులతో కలిపి పన్నెండు మందితో ఒక ఆటో వార్డెన్ బృందం ఏర్పాటు కాబోతున్నది. ఈ బృందం రోజు వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ, ఆటోల్ని తనిఖీలు చే యనుంది. ఆటో డ్రైవర్లు ఎవరైనా మీటర్లు వేయకున్నా, అధిక చార్జీలు వసూలు చేసినా, ఈ బృందం ఎలాంటి కేసులు నమోదు చేయదు. సంబంధిత ఆటో డ్రైవర్‌ను తీసుకెళ్లి, అతడిలో మార్పు వచ్చే వరకు ప్రత్యేక క్లాస్ తీసుకోనున్నారు. మళ్లీ...మళ్లీ పట్టుబడిన పక్షంలో ఆటోల సీజ్, భారీ జరిమానా మోత మోగించేందుకు ట్రాఫిక్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ఆటో వార్డెన్లు రోడ్డెక్కనున్నారు.

మరిన్ని వార్తలు