ముంబై.. ఇదేం ట్రాఫిక్‌రా బై..

6 Jun, 2019 02:31 IST|Sakshi

ఇక్కడ ప్రపంచంలోనే ట్రాఫిక్‌జామ్స్‌ అధికం

వాహనదారుల సమయమంతా రోడ్డుపాలు

టామ్‌ టామ్‌ అధ్యయనం

వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్‌ జామ్‌ బారిన పడుతున్న నగరాల్లో ముంబై ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్‌ అవర్స్‌లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నట్టు 2018 టామ్‌ టామ్‌ ట్రాఫిక్‌ ఇండెక్స్‌ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్‌ జామ్స్‌తో, వాహనరద్దీతో విలవిల్లాడుతోన్న నగరాల్లో కొలంబియా, పెరూ, మాస్కో లాంటి మహానగరాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లోని నగరాలకంటే కూడా మన దేశంలోని ముంబై నగర ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్‌ జామ్‌ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. బొగోటా, కొలంబియాల్లో వాహనాల రద్దీ 63 శాతంగానూ, లిమా, పెరూల్లో రద్దీ తీవ్రత 58 శాతంగానూ ఉంటే, న్యూఢిల్లీ 58 శాతం రద్దీతో ప్రపంచంలోనే ట్రాఫిక్‌ జామ్‌ తీవ్రతలో టాప్‌–5లో స్థానం సంపాదించింది. పై నాలుగు నగరాలు కూడా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనివే కావడం గమనించాల్సిన విషయం. ఇక 56శాతం వాహనరద్దీతో ముప్పుతిప్పలు పడుతూ ఐదో స్థానంలో ఉన్న మాస్కో.. అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా అనేక ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.  

పదేళ్ల అధ్యయనం.. 
ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీని జీపీఎస్‌ ఆధారంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ ముంబై మహానగరాన్ని ‘అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరం’గా తేల్చింది. అయితే 8 లక్షల జనాభాకు పైబడిన నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు. వాహనాల రద్దీపై గత పదేళ్లుగా అధ్యయనం చేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా భారతదేశంలోని వాహన రద్దీ స్థాయిని అంచనా వేసింది.  

ఆనందించాలా.. బాధపడాలా..!  
ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్‌ రద్దీ తీవ్రత పెరుగుతోందని టామ్‌ టామ్‌ అధ్యయన సంస్థకి చెందిన ప్రముఖుడు రాల్ఫ్‌ పీటర్‌ చెప్పారు. అయితే ఇది ఒకరకంగా ఆనందించాల్సిన విషయమూ, మరో రకంగా బాధపడాల్సిన విషయమూ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా బలోపేతమౌతోన్న ఆర్థిక వ్యవస్థను ఇది సూచిస్తోంటే, ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా విలువైన సమయాన్ని కోల్పోతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.  

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌పై దృష్టి పెట్టాలి.. 
దురదృష్టవశాత్తూ ప్రపంచమంతా కార్ల చుట్టూనే తిరుగుతోంది. అలాగే కార్ల కొనుగోలు, వాడకానికి సంబంధించిన నియమ నిబంధనలేవీ లేకపోవడం కూడా నష్టం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ని తగ్గించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం సుస్థిర పరిష్కారాలను సూచించగలుగుతుందని టామ్‌ టామ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ బార్బరా బేల్పెయిర్‌ అభిప్రాయపడుతున్నారు.  

>
మరిన్ని వార్తలు