కారు యజమానికి రూ. 9.8 లక్షల జరిమానా

30 Nov, 2019 09:19 IST|Sakshi

అహ్మదాబాద్‌ : విలాసవంతమైన పోర్షే కారుతో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తికి భారీ షాక్‌ తగిలింది. సరైన పత్రాలు, నంబర్‌ ప్లేట్‌ లేని కారణంగా అతడి కారును ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏకంగా రూ. 9.8 లక్షల మేర జరిమానా విధించారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు... అహ్మబాద్‌లోని హెల్మెల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద బుధవారం సిల్వర్‌ కలర్‌ పోర్షే కారు(911  స్పోర్ట్స్‌ కారు)ను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణించడంతో పాటు సరైన పత్రాలు లేకపోవడంతో కారును కాసేపు అక్కడే నిలిపారు. అనంతరం కారుకు సంబంధించిన సమాచారాన్ని చెక్‌ చేయగా లక్షల్లో జరిమానాలు పేరుకు పోయినట్లు గుర్తించారు. అన్నీ కలిపి దాదాపు 10 లక్షల రూపాయల జరిమానా విధించి.. చలానా చెల్లించిన తర్వాతే కారును తిరిగి ఇస్తామని కారు యజమానికి చెప్పడంతో అతడు బిక్క ముఖం వేశాడు.

కాగా ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ పోలీసులు ట్వీట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. ‘అమ్మో ఈ జరిమానాతో మరో కారును కొనుక్కోవచ్చు. బహుశా ఇదే అతిపెద్ద భారీ జరిమానా అనుకుంటా’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం వాహనదారులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన గురించి అహ్మదాబాద్‌ డీఎస్పీ మాట్లాడుతూ... మోటారు వాహన చట్టం ప్రకారం కారును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆర్టీవో మెమో ఇచ్చామని పేర్కొన్నారు. బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కారును అతడికి అప్పగిస్తామని తెలిపారు.

ఇక జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే. భారత్‌లోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రెండు అధునాతన కార్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘911 కార్రెరా ఎస్‌’ పేరిట విడుదలైన విలాసవంతమైన స్పోర్ట్స్‌ కారు ధర రూ.1.82 కోట్లు కాగా.. ‘911 కార్రెరా ఎస్‌ కాబ్రియోలెట్‌’ పేరుతో విడుదలైన మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. వెనుక ఇంజిన్‌ కలిగిన ఈ మోడల్‌ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని ఆటో మొబైల్‌ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా