నాన్నా.. నువ్వెళ్లు.. నేనొస్తా!

30 Sep, 2017 01:06 IST|Sakshi

ఓ మృతురాలి చివరి మాటలివే

సాక్షి ముంబై: ‘నాన్నా నీవు వెళ్లు. జనం రద్దీ తగ్గిన తరువాత నేను వస్తా’  ఎల్ఫిన్‌స్టన్‌ తొక్కిసలాటలో మృతిచెందిన 25 ఏళ్ల శ్రద్ధా వార్పె అనే యువతి చివరి మాటలివి. తండ్రి కిశోర్‌ వార్పెతో కలసి శ్రద్ధా పరేల్‌ స్టేషన్‌లో దిగింది. రద్దీ కారణంగా ఆమె స్టేషన్‌లోనే ఆగిపోగా, తొక్కిసలాట జరగకముందే కిశోర్‌ ఆ బ్రిడ్జిని దాటారు. ఆ తరువాత తన కూతురు కోసం ఎంతో వెతకగా మృతుల్లో ఆమె ఉందని తెలిసి ఆయన హతాశులయ్యారు. ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్‌ – పరేల్‌ రైల్వేస్టేషన్లను కలిపే వంతెనపై జరిగిన తొక్కిసలాట ఒక్క శ్రద్ధా కుటుంబంలోనే కాదు అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దసరా పండుగకు ఒక రోజు ముందు జరిగిన ఈ సంఘటనలో పలు కుటుంబాలు పెద్ద దిక్కును, చేతికొచ్చిన కుమారుడు, కుమార్తెలను కోల్పోయాయి.  

ఆఫీస్‌కు చేరేలోపే... 
పరేల్‌లో నివసించే థెరిసా ఫెర్నాండెజ్‌ రోజు మాదిరిగానే శుక్రవారం కూడా ఉదయం కార్యాలయానికి బయలుదేరింది. అయితే ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని మృతిచెందడంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.  

తండ్రికి ఆసరాగా వెళ్లి... 
పూలు, పూల దండలు విక్రయించి జీవనం గడిపే అంకుష్‌ పరబ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. తండ్రికి ఆసరాగా ఉండే ఆయన కుమారులిద్దరు ఆకాష్‌ (19), రోహిత్‌ (14)లు రోజు మాదిరిగానే పూలు తెచ్చేందుకు దాదర్‌లోని మార్కెట్‌కు వెళ్లారు. ఎల్ఫిన్‌స్టన్‌ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో రోహిత్‌ మరణించాడు.  

మరిన్ని వార్తలు