ఆధార్‌ నంబర్‌ ట్వీట్‌ చేసి.. చాలెంజ్‌ !

29 Jul, 2018 12:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ శనివారం తన ఆధార్‌ నంబర్‌ను ట్వీట్‌ చేసి.. సవాల్‌ విసిరారు. 12 అంకెల తన ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్‌ చేశారు. ఆధార్‌ నంబర్‌, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శర్మ ఈ ట్వీట్‌ చేశారు.

‘నా ఆధార్‌ నంబర్‌ ఇది.. (ఇక్కడ వెల్లడి చేయడం లేదు). ఈ వివరాలతో ఎలా నాకు హాని చేయగలరో ఒక్క సరైన ఉదాహరణ నాకు చూపండి. ఇది నా చాలెంజ్’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆధార్‌ కార్డులను జారీచేసే భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అయిన శర్మ ఓ ట్వీట్‌కు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆధార్‌ వివరాలు చాలా భద్రమని మీరు భావిస్తే.. మీ ఆధార్‌ కార్డు వివరాలు బహిర్గతం చేయండంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు. శర్మ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించలేదని ఫ్రెంచ్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఒకరు ఆరోపించారని ఓ నెటిజన్‌ పేర్కొనగా.. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. సమాచార భద్రత, ఆధార్‌ వివరాల పరిరక్షణ విషయమై ఆధార్‌ చట్టంలో పలు సవరణలు సూచిస్తూ.. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిన మరునాడే శర్మ ఈ చాలెంజ్‌ చేయడం గమనార్హం. అయితే, శర్మ ట్వీట్‌ చేసిన ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్‌ నంబర్‌, పాన్‌ నెంబర్‌ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్‌ చేస్తుండటం కొసమెరుపు.

మరిన్ని వార్తలు