పచ్చి అబద్ధం.. అలా జరగలేదు!

22 Oct, 2018 15:47 IST|Sakshi

అమృత్‌సర్‌: దసరా పండుగ రోజున పెను విషాదం మిగిల్చిన రైలు ప్రమాదంపై  భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాలపై గుమిగూడిన ప్రజలను చూసి అత్యవసర బ్రేకు వేశానని డీఈఎంయూ రైలు డ్రైవర్‌ అరవింద కుమార్‌ తెలిపారు. అయితే అక్కడున్నవారు రాళ్లు రువ్వడంతో రైలును ఆపకుండా అమృత్‌సర్‌ స్టేషన్‌కు చేర్చినట్టు వెల్లడించారు. అయితే ఈ వాదనను ప్రత్యక్ష సాక్షులు తోసిపుచ్చారు. (పెను ప్రమాదం.. అంతులేని శోకం)

‘డ్రైవర్‌ అరవింద కుమార్‌ అబద్దాలు చెబుతున్నారు. అసలు రైలును ఆపలేదు. కనీసం స్పీడు కూడా తగ్గించలేదు. క్షణాల వ్యవధిలోనే రైలు మమ్మల్ని దాటుకుని వెళ్లిపోయింది. రైలు కింద పడి ఎంతో మంది చనిపోయారు. క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా రాళ్లు విసురుతారా? అత్యంత వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు రువ్వడం సాధ్యమా?’ అని ప్రత్యక్ష సాక్షి మున్సిపల్‌ కౌన్సిలర్‌ శైలెందర్‌ సింగ్‌ షాలె ప్రశ్నించారు.

ఆస్కారమే లేదు
పెద్ద సంఖ్యలో గూమిగూడిన ప్రజలను చూసిన తర్వాత కూడా రైలు వేగం తగ్గించలేదని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ‘వేగంగా రైలు నడపడం వల్లే క్షణాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రైలును నెమ్మదిగా నడిపివుంటే ప్రమాద తీవ్రత తగ్గేది. రైలు ఎంత వేగంగా వెళుతుంతో తెలిపే వందలాది వీడియోలున్నాయి. మేమంతా స్పందించి, రాళ్లు విసరడానికి ఆస్కారమే లేదు. బాధితుల హాహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింద’ని పరమ్‌జీత్‌ సింగ్‌ అనే వ్యక్తి తెలిపారు.

విసిరేలోపు వెళ్లిపోయింది
ఎవరూ రాళ్లు విసరలేదని, రైలు డ్రైవర్‌ ఎందుకు అబద్ధం చెబుతున్నాడో అర్థం కావడం లేదని అజయ్‌ గోయంకా పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయన సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఒకవేళ రాళ్లు రువ్వాలనుకున్నా ఆలోపు రైలు వెళ్లిపోతుందన్నారు. అంత వేగంగా రైలు వెళ్లిపోయిందన్నారు. స్థానిక పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షుల వాదనతో ఏకీభవిస్తున్నారు. రైలు వెళుతుండగా అక్కడున్న వారెవరూ రాళ్లు విసరలేదని పోలీసు అధికారి సుఖ్‌మిందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై స్పందించేందుకు రైల్వే అధికారులు అందుబాటులోకి రాలేదు.

రైలు స్పీడు ఎంత?
ప్రమాదానికి కారణమైన డీజిల్‌ ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌(డీఈఎయూ) రైలు గరిష్ట వేగం గంటకు 96 కిలోమీటర్లు. రైలు ఖాళీగా ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే 300 మీటర్లలోపు ఆగుతుంది. ప్రయాణికులతో ఉంటే బ్రేకు వేసినప్పుడు 600 మీటర్లలోపు ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. చివరిసారిగా నమోదైన ఈ రైలు వేగం 68 కేఎంపీహెచ్‌ అని ఫిరోజ్‌పూర్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ వివేక్‌ కుమార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

‘మేడమ్‌..! 500 ట్రైన్‌లు వచ్చినా భయపడరు’

‘మరో జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం ఇది’

అమృత్‌సర్‌ ప్రమాదం : పాపం దల్బీర్‌ సింగ్‌

ప్రమాదంలో మా తప్పు లేదు : రైల్వే శాఖ

మరిన్ని వార్తలు