వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా వస్తున్న ట్రైన్‌ 18

27 Jan, 2019 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వారణాసి వరకూ నడిచే అత్యాధునిక హైస్పీడ్‌ ట్రైన్‌ 18 పేరును వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ రైలు మేక్‌ ఇన్‌ ఇండియా కింద ప్రపంచ స్ధాయి రైళ్ల నిర్మాణం మనకు సాధ్యమవుతుందనేందుకు నిదర్శనమని ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 16 కోచ్‌ల ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలును రూ 97 కోట్ల వ్యయంతో రాయ్‌బరేలిలోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాకర్టీ 18 నెలల పాటు శ్రమించి పట్టాలపైకి ఎక్కించనుంది. 30 సంవత్సరాల కిందట ప్రారంభించిన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ వారసత్వానికి కొనసాగింపుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను భావిస్తున్నారు. పూర్తి ఏసీ సదుపాయం కలిగిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశంలోనే తొలి ఇంజన్‌ రహిత రైలుగా గుర్తింపు పొందనుంది. రెండు ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్లుండే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌, అలహాబాద్‌లలో ఆగుతుంది.

మరిన్ని వార్తలు