రైలు చార్జీల పెంపు తప్పదేమో!

1 Jun, 2014 02:32 IST|Sakshi
రైలు చార్జీల పెంపు తప్పదేమో!

రైల్వే మంత్రి సదానంద గౌడ

 బెంగళూరు: రైల్వే ప్రయాణ, రవాణా చార్జీల పెంపు తప్పదేమోనని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల భద్రత, మెరుగైన సేవలు, రక్షణ, వేగం.. ప్రధానంగా వీటిపైనే తాను దృష్టి పెట్టనున్నట్లు ఆయన శనివారం మంగళూరులో వెల్లడించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి నిధులు అవసరమన్నారు.

అందువల్ల టికెట్ల ధరల పెంపు అనివార్యమని, అయితే ప్రయాణికుల పైనే భారమంతా మోపబోమని పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చించిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రయాణికుల చార్జీలను 10%, రవాణా చార్జీలను 5% పెంచి.. ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా గత ప్రభుత్వంలోని రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే తనపై ఇప్పుడు భారం మోపారని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తుందని గౌడ హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు