త్వరలో రైళ్లలో ‘జీరో–ఎఫ్‌ఐఆర్‌’

15 Oct, 2018 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: వేధింపులు, దొంగతనం, మహిళలపై నేరాల వంటివి రైళ్లలో చోటుచేసుకున్నప్పుడు ప్రయాణికులు ఉన్నపళంగా మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇలా వచ్చిన ఫిర్యాదులను ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’గా పేర్కొంటారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే రక్షక దళ (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది స్పందించి దర్యాప్తు ప్రారంభిస్తారని ఆర్‌పీఎఫ్‌ డీజీ అరుణ్‌ చెప్పారు. ప్రస్తుతం ఏదైనా నేరం జరిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయాలంటే సంబంధిత పత్రాన్ని టీటీఈ నుంచి తీసుకుని, నింపి తర్వాతి స్టేషన్లో ఆర్‌పీఎఫ్‌ లేదా జీఆర్‌పీ సిబ్బందికి అందజేయాల్సి ఉంది. ఈ జాప్యాన్ని నివారించి, నేరం రైల్లో ఎప్పుడు, ఏ ప్రదేశంలో జరిగినా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ యాప్‌ను రైల్వే తీసుకొస్తోంది. ఆర్‌పీఎఫ్‌ సిబ్బందితోపాటు ప్రభుత్వ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ), టీటీఈ, టీసీ తదితరులకు ఈ యాప్‌ అనుసంధానమై ఉంటుంది. ఆఫ్‌లైన్‌లోనూ పనిచేసే ఈ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా పానిక్‌ బటన్‌ కూడా ఉంటుంది.

మరిన్ని వార్తలు