వాళ్లకి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి

11 May, 2020 17:06 IST|Sakshi

ఓపెన్‌ కాని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఇక్కట్లు 

సాయంత్రం 6 నుంచి ఆన్‌లైన్‌ బుక్కింగ్‌ అంటూ వివరణ

రైళ్లలో క్యాటరింగ్‌ భోజనానికి మంగ‌ళం

ముందుగా బుక్ చేసుకుంటే వాట‌ర్ బాటిళ్లు

అప్పటికప్పుడు టికెట్‌ కొనుక్కునేందుకు నో ఛాన్స్‌

సాక్షి, న్యూ ఢిల్లీ:  రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంట‌ల‌ నుంచి టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చంటూ‌ రైల్వే శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో త‌మ బెర్తుల‌ను ఖ‌రారు చేసుకునేందుకు ఎదురుచూసిన ప్ర‌జ‌ల ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఎంత‌కూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ తెరుచుకోక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి లోన‌య్యారు. దీనిపై స్పందించిన అధికారులు.. మొత్తం 30 స‌ర్వీసుల‌ను న‌డుపుతుండ‌గా ఇందులో 15 ప్ర‌త్యేక రైళ్ల టికెట్ బుకింగ్ సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి కొన్ని రూట్లలో రైళ్లు నడుపుతామని రైల్వే శాఖ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్, బెంగళూర్‌, చెన్నై, ముంబై సెంట్రల్‌, తిరువ‌నంతపురం, అహ్మదాబాద్‌కు రైళ్లు నడుప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. తాజాగా ఈ ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రైళ్లలో క్యాటరింగ్‌ భోజనం ఉండదని స్ప‌ష్టం చేసింది. ఏసీ రైలు అయినా బెడ్‌ షీట్లు, టవల్‌ ఇవ్వరని పేర్కొంది. (రైల్వే జనరల్‌ టికెట్లు మరింత తేలిక! )

ఏడు రోజుల ముందు మాత్రమే IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. రైళ్లలో ఆర్ఏసీ ప్రయాణాలు, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండద‌ని తెలిపింది. కేవలం కన్‌ఫార్మ్‌డ్‌ టికెట్‌ ఉన్నవాళ్లకే స్టేషన్‌లోకి అనుమతిస్తామ‌ని పేర్కొంది. తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ బుకింగ్‌ సౌకర్యం ఉండదని చెప్పింది. అప్పటికప్పుడు టికెట్‌ కొనుక్కునే అవకాశం లేదని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత క్యాన్సల్‌ చేసుకుంటే తిరిగి ఇవ్వాల్సిన సొమ్ములో 50% కోత విధిస్తామంది. ముందు బుక్‌ చేసుకున్న‌వారికి వాటర్‌ బాటిళ్లు ఇస్తామ‌ని తెలిపింది. ప్రయాణ సమయానికి గంటన్నర ముందే స్టేషన్‌కు చేరుకోవాల‌ని ప్ర‌యాణికుల‌ను కోరింది. (రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు