పెరగనున్న ఆన్‌లైన్‌ రైల్వే టికెట్‌ ధరలు

10 Aug, 2019 16:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  రైల్వే ప్రయాణీకులకు  చేదువార్త. త్వరలోనే  ఇ-టికెట్ల చార్జీల మోత మోగనుంది. నోట్ల రద్దు తరువాత డిజిటల్‌ లావాదేవీల ప్రోత్సాహానికంటూ రద్దు చేసిన  సర్వీసు చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైల్వే శాఖ బోర్డు  తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తాజా సమాచారం.  ముఖ్యంగా ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లు కొనుగోలుపై సర్వీస్‌ ఛార్జీలను విధించేందుకు రైల్వే బోర్డు  అనుమతినిచ్చింది. ఆగస్టు 3న విడుదల చేసిన భారత రైల్వే బోర్డు లేఖలో దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలనే ఉంచుతుందా లేక పెంచుతుందా అన్న నిర్ణయాన్ని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. ఇటీవలి  కాలంలో తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న  నేపథ్యంలో రైల్వే  బోర్డు ఈ నిర్ణయం తీసుకోనుందని  తెలుస్తోంది. 

దేశంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం సేవల ఛార్జీలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 2016లో ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ద్వారా టికెట్లు కొనుగోలు చేసేవారికి సర్వీస్‌ ఛార్జీలను నిలిపివేసింది. అప్పటి వరకు ఐఆర్‌సీటీసీ నాన్‌ ఏసీ టికెట్‌పై రూ. 20, ఏసీ టికెట్‌పై రూ. 40 సర్వీసు ఛార్జీలను వసూలు చేసేది. సేవా ఛార్జీలు విధించడం, పునరుద్దరించడం వంటి నిర్ణయాలను ఐఆర్‌సీటీసి తీసుకోవచ్చని పేర్కొంది.  కాగా  సేవా ఛార్జీలు నిలిపివేసిన అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ఆదాయంలో 26 శాతం పడిపోయింది.

>
మరిన్ని వార్తలు