‘నవ్వుతారు ఎక్కడికైనా వెళ్లిపో అన్నారు.. కానీ ఇప్పుడు!’

9 Jan, 2019 09:50 IST|Sakshi
రాహుల్‌ గాంధీని కలిసిన ఎంపీ సుస్మితాదేవ్‌, అప్సరారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అప్సరారెడ్డి

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్త అప్సరా రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆమె కలిశారు. ఈ నేపథ్యంలో.. ‘మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డికి స్వాగతం పలుకుతున్నాం. సామాజిక నిబంధనలను అధిగమించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు, అవి ఆమోదం పొందేందుకు సుస్మితాదేవ్‌(కాంగ్రెస్‌ ఎంపీ) దారులు పరిచారు అంటూ కాంగ్రెస్‌ మహిళా విభాగం ట్వీట్‌ చేసింది.

తన నియామకం గురించి అప్సరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నీ(ట్రాన్స్‌జెండర్‌) జీవిత కాలంలో ఎటువంటి అద్భుతాలు జరగవనే జరగవు. నిన్ను చూసి నవ్వుతారు. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో అనే మాటలే నేను విన్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాలాంటి వారికి వెటకారాలు, వెక్కిరింపులు కొత్తేం కాదు. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్ల తరపున నా గొంతు బలంగా వినిపిస్తాను. భారత్‌లోని అతిపెద్ద, సుదీర్ఘ చరిత్ర గల పార్టీలో నాకు ఈ పదవి దక్కడం... ఉద్వేగానికి గురిచేస్తోంది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

కాగా 134 ఏళ్ల పార్టీ చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇటువంటి పదవి దక్కడం ఇదే తొలిసారి. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన అప్సరారెడ్డి 2016లో ఏఐఏడీఎంకే(అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత శశికళ అనుకూల వర్గానికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు.

>
మరిన్ని వార్తలు