గుడ్‌ న్యూస్‌: పాన్‌ కార్డులో కొత్త ఆప్షన్‌

10 Apr, 2018 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్‌ కార్డులో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌  కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి)  సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ  ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది.

స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

కాగా ఇన్ని రోజుల ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్‌ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి.

మరిన్ని వార్తలు