భారీ పెనాల్టీలపై నిరసన: స్తంభించిన రవాణా

19 Sep, 2019 08:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు వడ్డిస్తూ మోటార్‌ వాహన చట్టంలో చేపట్టిన సవరణలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో పలు ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు గురువారం సమ్మెకు పిలుపుఇచ్చాయి. రవాణా సమ్మెతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలు నిలిచిపోవడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

ట్రక్కులు, బస్‌లు, ఆటోలు, టెంపోలు, మ్యాక్సి క్యాబ్స్‌ సహా అన్ని వాహనాలకు సంబంధించిన 41 సంస్థలు, సంఘాలతో కూడిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌టీఏ) సమ్మెకు పిలుపు ఇచ్చింది. మోటార్‌ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్‌ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. (చదవండి: హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!)

మరిన్ని వార్తలు