‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’

6 Feb, 2019 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు చేపట్టింది. సీజేఐ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఆర్‌ఎఫ్ నారిమన్‌, ఏఎం ఖన్విల్కర్‌, డీవై చంద్రచూడ్‌, ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కే పరాశరన్‌ విజ్ఞప్తి చేశారు.

ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా రుతుక్రమం కలిగిన స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రివ్యూ పిటిషన్‌లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా కోర్టుకు నివేదించారు.

రివ్యూ పిటిషన్‌ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25కు విరుద్ధమని, సుప్రీం ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించాలని కోరరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావన్‌కోర్‌ దేవస్ధానం బోర్డు న్యాయవాది రాకేష్‌ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు.

ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అలంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించినదని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా టీవీల్లో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

మరిన్ని వార్తలు