మూడేళ్లలో పర్యాటక రంగానికి ప్రాణం

1 Jul, 2020 22:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవడ్‌–19 కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ పర్యాటక పరిశ్రమ కోలుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి కనీసం మూడేళ్లు పడుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్‌ ఏజెన్సీ ‘ఫ్లైట్‌ సెంటర్‌’ సీఈవో గ్రహం టర్నర్‌ తెలిపారు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం విమానాలు ఎక్కడానికి ముందు, ఆ తర్వాత 15 రోజుల చొప్పున క్వారంటైన్‌లో ఉండాలని, ఈ నిబంధనను సడలిస్తే అంతర్జాతీయ పర్యాటక రంగం వేగంగా పుంజుకోవచ్చని ఆయన చెప్పారు. క్వారంటైన్‌లో అన్ని రోజులు ఉండడమే కష్టమైతే, విమానం ఎక్కడానికి ముందు, దిగిన తర్వాత 15 రోజుల చొప్పున 30 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు ఎవరు ఇష్ట పడరని ఆయన అన్నారు.

ప్రపంచ పర్యాటక పరిశ్రమ 70 శాతం కోలుకోవడానికి 18 నెలల నుంచి రెండేళ్లు పడుతుందని, అదే పూర్తిగా కోలుకోవడానికి మూడేళ్లపాటు నిరీక్షించాల్సి వస్తోందని టర్నర్‌ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ‘ఫ్లైట్‌ సెంటర్‌’ ప్రపంచవ్యాప్తంగా 16 వేల మంది సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది. వర్జిన్‌ అండ్‌ క్వాంటాస్‌ అనే ట్రావెల్‌ ఏజెన్సీ కూడా వేలల్లో వైమానిక సిబ్బందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సిబ్బంది ఉపాది కోల్పోకుండా ఉండాలంటే పర్యాటకులు, టూరిజం ఆపరేటర్లు చొరవ తీసుకోవాలని టర్నర్‌ పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు