దారుణం: అంత్య‌క్రియ‌లకు డ‌బ్బుల్లేక‌.. మృతదేహాన్ని..

1 Jul, 2020 15:56 IST|Sakshi

భోపాల్‌: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన ఓ మ‌హిళ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌లేక‌ న‌దిలో ప‌డేసిన ఘట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల వ‌య‌సున్న‌ గిరిజ‌న మ‌హిళ మృతదేహాన్ని బండి మీద తీసుకెళ్లి న‌దిలో ప‌డేసిన ఘ‌ట‌న వైర‌ల్ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. సిధి జిల్లాలో గ‌త కొద్ది రోజులుగా ఓ గిరిజ‌న మ‌హిళ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు. ఆదివారం రోజున ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో అంబులెన్స్ స‌హాయం కోసం కాల్ చేశారు. అటునుంచి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో మంచం మీద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో ఆమెను ప‌రీక్షించిన వైద్యులు మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ల‌డానికి డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అంబులెన్స్‌ను పంపాల‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాల‌ని అడిగారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వారు నిరాక‌రించారు. దీంతో చేసేదేమీ లేక భోపాల్‌కు ఈశాన్యంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోన్ న‌దిలో మృతదేహాన్ని ప‌డేశారు. సోమవారం రోజున ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

దీనిపై ఆమె భ‌ర్త మ‌హేష్ కోల్ మాట్లాడుతూ.. మేము స‌హాయం కోసం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యాన్ని సంప్ర‌దించాము. అయితే ఆదివారం కావ‌డంతో వారు త‌మకు ఎటువంటి స‌హాయాన్ని అందించ‌లేమ‌ని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ కావడంతో దాత‌లు 5 వేల రూపాయ‌లు స‌హాయం చేశారని చెప్పుకొచ్చారు. ఘ‌ట‌న‌పై సిధి జిల్లా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. డ‌బ్బులు లేక మృత‌దేహాన్ని న‌దిలో ప‌డేయ‌డం విషాద‌క‌ర‌మన్నారు. ఇందులో అధికారుల అల‌స‌త్వం ఉంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు క‌మ‌ల్‌నాథ్.. బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాజ్ పాయ్ స్పందిస్తూ.. వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేయడం తగదన్నారు. ఘ‌ట‌న‌పై ప్రభుత్వానికి సమాచారం ఉంటే ఖ‌చ్చితంగా స్పందించేద‌ని తెలిపారు. (డబ్బుల కోసమే జంట హత్యలు)

మరిన్ని వార్తలు