100 మంది ఒక్కసారిగా దాడి చేయడంతో!

29 Jul, 2018 15:58 IST|Sakshi

గాంధీనగర్‌ : మూక దాడులను నిరోధించడడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని కోర్టులు ఆదేశించినప్పటికి ప్రభుత్వాలు మాత్రం దాడులను అరికట్టలేకపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ జిల్లాలో ఇద్దరు గిరిజన యువకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం అజ్మల్‌ వహోనియా (22), భారు మాతూర్‌ అనే ఇద్దరు యువకులను దొంగలుగా భావించిన గ్రామస్తులు దాదాపు 100 మంది వారిపై శనివారం రాత్రి దాడి చేయడంతో అజ్మల్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్మల్‌, భారు మాతూర్‌ రెండు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై బయటకువచ్చారు. బాధితులతో పాటు, దాడికి పాల్పడిన వారందరూ తూర్పు గుజరాత్‌కి చెందిన గిరిజనులు కావడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శనివారం రాత్రి సుమారు 20 మంది గ్రామంలోకి ప్రవేశించారని, ఇందులో ఇద్దరిపై దాడి జరగగా మిగతా 18 మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు