ఓటేసేందుకు 8 గంటలు నడిచారు

7 May, 2019 00:17 IST|Sakshi

జిల్లా కేంద్రానికి 90 కిలో మీటర్ల దూరంలో అడవిలో ఉన్న గిరిజన గ్రామమది. దాదాపు 300 మంది గ్రామస్తులు పొద్దున్నే రొట్టెలు తదితర అవసరమైన సరుకులు మూటకట్టుకున్నారు . 8 గంటల పాటు పది కిలోమీటర్లకు పైగా నడిచి గమ్యస్థానం చేరుకోవడానికి వారు బయలుదేరారు. అంత వ్యయప్రయాసలకోర్చి కొండలు, గుట్టలు అధిగమిస్తూ వారు వెళుతున్నది ఓటు వేయడానికి.....అయితే, అంత కష్టపడి వెళ్లి ఓటు వేసే ఆ గిరిజనులకు తమ నియోజకవర్గం అభ్యర్థులెవరో తెలియకపోవడం విశేషం. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న బందర్‌పని గ్రామస్తులు వారు. రవాణా సదుపా యాలు లేని, జన జీవన స్రవంతికి దూరంగా ఉన్న ఆ గిరిజనులు ప్రతి ఎన్నికల్లోనూ తప్పకుండా ఓటు వేస్తారు. తమ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులెవరో వారికి తెలియకపోయినా ఓటు మాత్రం వేయకుండా ఉండరు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీల పేర్లే వారికి తెలుసు.

అడవిలోపల ఎక్కడో కొండమీద ఉన్న బందర్‌పనిలో 60 కొర్కు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొదట్లో చింద్వారాలో ఉండే వీరు 2001లో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తాము అడవి బిడ్డలమని, అందుకే అడవిలోకి వచ్చామని,ఇక్కడే సాగు చేసుకుంటూ బతుకుతున్నామని వారు చెబుతున్నారు. ఇప్పటికీ గ్రామంలో కనీస సదుపాయాలు లేవు. ఓటేస్తే గెలిచిన వాళ్లు తమ గ్రామానికి రోడ్డు, స్కూలు వంటివి ఏర్పాటు చేస్తారని కొందరు ఆశిస్తోంటే, ఓటెయ్యకపోతే తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి కొట్టేస్తారేమోనన్న భయాన్ని కొందరు వ్యక్తం చేశారు. కారణం ఏదయినా వీళ్లు ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తున్నారు. మీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా అని అడిగితే 35 ఏళ్ల షెకాల్‌ తెల్లముఖం వేశాడు. కాసేపాలోచించి నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ అని బదులిచ్చాడు. మరో ఓటరు తాను ఓటు వేసే పార్టీ పేరు చెప్పాడుకానీ ఆ పార్టీ గుర్తును గుర్తుపట్టలేకపోయాడు. ఏమైనా ఓట్లు అడగడానికి అభ్యర్ధులు దూరాభారాలు వెళ్లడం మామూలే కాని ఓటు వేయడం కోసం పనికట్టుకుని ఇంత కష్టపడటం మెచ్చుకోతగ్గదే. 
 

మరిన్ని వార్తలు