బినామీ కేసులకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

25 Oct, 2018 03:11 IST|Sakshi

ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల కేసుల సత్వర విచారణకు అపిలేట్‌ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా అప్పిలేట్‌ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థలు విధులు నిర్వర్తించనున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ప్రాధికార సంస్థకు అనుబంధ బెంచ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ సంస్థ చైర్మన్‌ను సంప్రదించిన తరువాత బెంచ్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో బినామీ కేసులు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద తీసుకున్న చర్యలకు న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థ తొలి సమీక్ష వేదికగా పనిచేస్తుంది. ప్రాధికార సంస్థ ఆదేశాలను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు.

ఆశా సమన్వయకర్తల భత్యాల పెంపు:
ఆశా సమన్వయకర్తల పర్యవేక్షణ భత్యాలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ పచ్చజెండా ఊపింది. అక్టోబర్‌ నుంచి ఒక్కో క్షేత్రస్థాయి పర్యవేక్షణ పర్యటనకు రూ.250కి బదులు రూ.300 చెల్లిస్తారు. ఫలితంగా ఆశా సమన్వయకర్తలు నెలకు పొందే మొత్తం వేతనం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగనుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 41 వేల ఆశా సమన్వకర్తలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేబినెట్‌ నిర్ణయం పట్ల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆశా కార్యకర్తల నుంచే సమన్వయకర్తలను ఎంపికచేస్తారు.
∙ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌     (ఐఐఎస్‌ఎస్‌) ఏర్పాటుకు ఆమోదం.

మరిన్ని వార్తలు