మహిళలపై బెంగాల్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

26 Jul, 2019 15:07 IST|Sakshi

కోల్‌కతా : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ఎస్పీ నేత ఆజం ఖాన్‌ బాటలో నడిచిన పశ్చిమ బెంగాల్‌ మంత్రి అభాసు పాలయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న మహిళా టీచర్లపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర మంత్రి పార్ధ ఛటర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కోల్‌కతాలో ప్రైమరీ టీచర్లతో సమావేశమైన మంత్రి కొందరు టీచర్లు స్త్రీ రోగంతో ఇబ్బందులు పడుతున్నారని, వీరిని చూసి తానూ భయపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక టీచర్లు ఆందోళనను విరమించాలని మంత్రి కోరారు. గత రెండు వారాలుగా సాల్ట్‌లేక్‌ ప్రాంతంలో పలువురు టీచర్లు వేతన పెంపు, బదిలీల ఉత్తర్వుల నిలిపివేత వంటి డిమాండ్లతో నిరాహారదీక్షలు చేపట్టారు. మంత్రి వ్యాఖ్యలను పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు లోక్‌సభలో స్పీకర్‌ స్ధానంలో కూర్చున్న బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ ఎంపీ ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు