మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్‌ తలాక్‌ పిటిషనర్‌

16 Aug, 2019 03:47 IST|Sakshi

కోల్‌కతా: ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన ఐదుగురిలో ఒకరైన పశ్చిమ బెంగాల్‌ మహిళ ఇష్రత్‌ జహాన్‌ గురువారం ఢిల్లీకి వచ్చి మోదీకి రాఖీ కట్టారు. తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించేలా చట్టాన్ని తెచ్చినందుకు ముస్లిం సోదరిల తరఫున ఆమె మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. త్రివర్ణాలతో ఉన్న రాఖీని మోదీ చేతికి కట్టే అవకాశం వచ్చినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే తాను కోల్‌కతా నుంచి తెచ్చిన రసగుల్లాను భద్రతా కారణాల వల్ల మోదీకి ఇవ్వలేకపోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని హౌరాలో నివసించే ఇష్రత్‌ జహాన్‌కు దుబాయ్‌లోని తన భర్త 2014లో మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఆగస్టు 22న సుప్రీం కోర్టు ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయగా, ఆ చర్యను నేరంగా పరిగణించేలా కేంద్రం చట్టం తెచ్చింది. 

మరిన్ని వార్తలు