అందాల పోటీలపై త్రిపుర సీఎం వ్యాఖ్యలు

27 Apr, 2018 10:35 IST|Sakshi
అందాల పోటీల నిర్వహణ గురించి వివాదస్పద వ్యాక్యలు చేసిన త్రిపుర సీఎమ్‌ బిప్లాబ్‌ కుమార్‌ దేబ్‌

అగర్తల : వివాదాలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఆదేశించినా.. బీజేపీ నేతలు మాత్రం పాటించటం లేదు. గత కొన్ని రోజులుగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మహాభారతకాలంలో ఇంటర్నెట్‌, శాటిలైట్‌ వ్యవస్థ కామెంట్లు చేసిన ఆయన.. మమతా బెనర్జీకి మతి చెడిందంటూ తాజాగా వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. ఇక ఇప్పుడు మరోసారి అందాలపోటీలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

గురువారం ప్రజ్ఞా భవన్‌లో చేనేత, హస్త కళాకృతుల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ను ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించారు. ‘విదేశీ వస్త్ర వ్యాపారులు అందాల పోటీల నిర్వహణ నెపంతో తమ  సౌందర్య ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకుంటున్నారు.  ఈ అందాల పోటీల్లో విజేతను ముందుగానే నిర్ణయిస్తారు.  ఏ దేశ వస్త్రాలను, సౌందర్య సాధనాలను ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారో.. ఆ దేశానికి చెందిన వారినే విజేతలుగా నిర్ణయిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మహిళలు పోటీల్లో గెలుస్తున్నారు. ఇది మంచి విషయమే ఎందుకంటే మన దేశంలో స్త్రీని లక్ష్మీ, సరస్వతి వంటి దేవతా మూర్తులకు సమానంగా భావిస్తాము. ఐశ్వర్య రాయ్‌ భారతీయ మహిళల ప‍్రతినిధిగా పోటిల్లో పాల్గొని.. కిరీటం గెలుచుకుంది. అందుకు ఆమె అర్హురాలు. కానీ, డయానా హెడెన్‌ ఎవరు? ఎవరికి ప్రతినిధిగా ఈ పోటిల్లో పాల్గొంది? నిర్వహకులకు ఆమెలో  ఏం అందం కనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇదంతా అంతర్జాతీయ వస్త్ర వ్యాపారుల మాఫియా’ అంటూ తీవ్రంగా విమర్శించారు.

‘గతంలో భారతీయ మహిళలు ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించేవారు కాదు. స్నానం చేయడం కోసం మట్టిని, తలను శుభ్రపరుచుకోవడం కోసం మెంతులను వాడేవారు. ఎప్పుడైతే విదేశీ వస్త్ర వ్యాపారులు తమ ఉత్పత్తులను మన దేశంలో మార్కెట్‌ చేయడం మొదటుపెట్టారో అప్పటి నుంచి మన దేశంలో కూడ ఈ సౌందర్య సాధనాల వినియోగం ప్రారంభమైంది. ఇప్పుడు మనదేశంలో ప్రతి వీధిలో ఒక బ్యూటీ పార్లర్‌ ఉంది’ అన్నారు.

విప్లవ్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మీ వ్యాక్యలు మిమ్మల్ని ఒక పిచ్చివాడిగా.. రేపిస్టుగా చూపిస్తున్నాయి’ అని అనిత అనే సామాజిక కార్యకర్త విమర్శించారు.

మరిన్ని వార్తలు