అనుకున్నట్లే ఆయనకే కొత్త సీఎం పదవి

17 Mar, 2017 17:17 IST|Sakshi
అనుకున్నట్లే ఆయనకే కొత్త సీఎం పదవి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. అందరూ ఊహించినట్లుగానే త్రివేంద్ర సింగ్‌ రావత్‌నే తమ ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకున్నారు. ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనిపైనే శుక్రవారం డెహ్రాడూన్‌లో కేంద్రమంత్రులు జేపీ నడ్డాతోపాటు డీ ప్రధాన్‌ తదితరులు వెళ్లి కొత్త సీఎం అభ్యర్థిపై చర్చించారు.

సీఎం రేసులో ప్రకాశ్‌ పంత్‌, త్రివేంద్ర సింగ్ రావత్‌, సత్పాల్‌ మహారాజ్‌ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం త్రివేంద్రను వరించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి తన జీవితాన్ని త్రివేంద్ర ప్రారంభించారు. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడైనందునే ఈయన ఎంపిక ఖరారయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టింది. శనివారం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవనున్నారు.

మరిన్ని వార్తలు