జాతీయ క్యారియర్‌గా ట్రూజెట్‌

11 Mar, 2018 02:52 IST|Sakshi

మరో 20 రూట్లలో విమాన సేవలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా రెండున్నరేళ్ల కిందట ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ఆరంభించిన ట్రూ జెట్‌.. జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవిస్తోంది. టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ సంస్థ... తాజాగా మరో 20 రూట్లలో విమాన సేవలు ఆరంభించేందుకు అనుమతులు సాధించినట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా కనెక్టివిటీకి ఉద్దేశించిన ఉడాన్‌ పథకం రెండో దశ కింద ఈ 20 రూట్లలో తాము లైసెన్సులు పొందినట్లు టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ హెడ్‌ (కమర్షియల్‌ విభాగం) సెంథిల్‌ రాజా తెలియజేశారు.

కొత్త రూట్లలో అహ్మదాబాద్‌ – పోర్‌బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గామ్, గౌహతి– కుచిహార్, బర్నపూర్, తేజు, తేజపూర్‌ తదితరాలున్నాయి. ‘‘ఇప్పటిదాకా ట్రూజెట్‌ ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. తాజా రూట్లతో పశ్చిమ, తూర్పు తీరంతో పాటు ఈశాన్య భారత్‌లో కూడా సేవలు విస్తరించినట్లు అవుతుంది. ఈ నెల 25న చెన్నై–సేలం రూట్‌లో విమాన సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రమోషనల్‌ ఆఫర్‌గా టికెట్‌ను రూ.599కే ఆఫర్‌ చేస్తున్నాం’’ అని రాజా వివరించారు. ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ దిగ్గజం ‘మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఎంఈఐఎల్‌)లో టర్బోమేఘా ఎయిర్‌వేస్‌ భాగంగా ఉంది.  

మరో ఏడు విమానాల కొనుగోలు..
ట్రూజెట్‌కు ప్రస్తుతం 5 విమానాలున్నాయి. వీటితో 13 ప్రాంతాలకు రోజుకు 32 సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరో ఏడు విమానాలను సమకూర్చుకోనున్నట్లు రాజా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్‌ రూట్లతో పాటు ఉడాన్‌ స్కీమ్‌ కింద కడప, ఔరంగాబాద్, మైసూరు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా రోజూ సుమారు 2 వేల మందిని వివిధ ప్రాంతాలకు చేరుస్తున్నట్లు తెలియజేశారు.

సీఎఫ్‌ఎంతో స్పైస్‌జెట్‌ భారీ డీల్‌
గురుగ్రామ్‌: విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్‌ తాజాగా జెట్‌ ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో 12.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లీప్‌ 1బీ ఇంజిన్ల కొనుగోలు, సర్వీసులకు ఈ డీల్‌ ఉపయోగపడనుంది. ప్రస్తుతం తమ విమానాల్లో ఉపయోగిస్తున్న సీఎఫ్‌ఎం56 కన్నా లీప్‌–1బీ ఇంజిన్లు సమర్థమంతంగా ఉండగలవని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం 38 పైచిలుకు ’సీఎఫ్‌ఎం56–7బి’ ఇంజిన్ల ఆధారిత బోయింగ్‌ ’737’ రకం విమానాలు స్పైస్‌జెట్‌ ఉపయోగిస్తోంది.

మరిన్ని వార్తలు