సీఏఏ అల్లర్లపై స్పందించిన ట్రంప్‌

25 Feb, 2020 18:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. మంగళవారం సాయంత్రం ట్రంప్‌ మీడియా భేటీ సందర్భంగా దేశ రాజధానిలో తలెత్తిన హింసాత్మక నిరసనలను ప్రస్తావించగా ఈ ఘటనలను తాను విన్నానని, కానీ వీటిపై తాను చర్చించలేదని, ఇది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని ట్రంప్‌ స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో తాము చర్చించామని, ప్రజలకు మత స్వేచ్ఛ ఉండాలని మోదీ గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. మతస్వేచ్ఛపై ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు.

సీఏఏ గురించి మోదీతో తాను చర్చించలేదని మోదీ స్పష్టం చేశారు. ఇక సీఏఏ హింసాత్మక నిరసనలు, వ్యక్తిగత దాడులు, ఘటనల గురించి తాను విన్నానని వాటిపై తాను చర్చించలేదని..వాటిని భారత్‌ ఎదుర్కొంటుందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరుసగా రెండో రోజూ పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సహా తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు అల్లర్లు జరిగే ప్రాంతాలకు పెద్ద ఎత్తున పోలీసులను తరలించి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

చదవండి : నేను ఓడిపోతే మార్కెట్లు ఢమాల్‌..

మరిన్ని వార్తలు