రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు రావట్లేదు

28 Oct, 2018 04:27 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

భారత్‌కు ట్రంప్‌ లేఖ

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ భారత్‌ పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. కొత్త ఏడాది ఆరంభంలో స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంతోపాటు తనకు వేరే పనులు ఉండటంతో రావడం కుదరదంటూ అమెరికా యంత్రాంగం భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌కు లేఖ పంపింది. భారతగణతంత్ర దినోత్సవంలో ప్రతిఏడాదీ ఒక దేశాధినేతను ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానిస్తుంది. అదే కోవలో వేడుకల్లో పాల్గొనాలంటూ భారత అమెరికా అధ్యక్షుడికి జూలైలో ఆహ్వానం పంపింది. అయితే, ట్రంప్‌ పాల్గొనేదీ లేనిదీ 2 ప్లస్‌ 2 చర్చల తర్వాత చెబుతామంటూ అమెరికా వాయిదా వేసింది. అనంతర పరిణామాలు ఆ దేశ వైఖరిలో మార్పునకు కారణమయ్యాయి. క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ట్రయంఫ్‌’ కొనుగోలుకు భారత్‌ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇరాన్‌ నుంచి చమురును కొనరాదన్న అమెరికా ఆంక్షలను బేఖాతరు చేయడం ట్రంప్‌ అసంతృప్తికి కారణమయ్యాయని భావిస్తున్నారు. కాగా, గత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్టేట్‌ ఆఫ్‌ ది యూనియ న్‌ ప్రసంగం, ఇతరత్రా కార్యక్రమాలు ఉన్నప్పటికీ 2015 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు