ఆవిడే.. కలెక్టర్ చంద్రకళ!

5 Feb, 2016 12:38 IST|Sakshi
ఆవిడే.. కలెక్టర్ చంద్రకళ!

సముద్రపు అలలు, రైలు పట్టాలు, తగలబడే భవంతులు, అందమైన మహిళ.. సెల్ఫీ దిగటానికి ఇలాంటి వెరైటీ చోట్ల ప్రయత్నాలు చేసి చివరికి అలల ఉధృతికో, రైలు వేగానికో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇక మహిళలతో సెల్ఫీ అంటే కచ్చితంగా ఆమె అనుమతి తప్పనిసరి. లేదంటే.. ఇదిగో ఈ యువకుడిలా కటకటాలపాలవ్వాల్సి వస్తుంది. సెల్ఫీ దిగబోయి జైలు పాలైనవాడి పేరు అహ్మద్. సెల్ఫీని నిరాకరించిన ఆ.. ఆవిడ.. కలెక్టర్ చంద్రకళ. ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథనంలోకి వెళితే..

బులందేషహర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్)గా పనిచేస్తోన్న బి. చంద్రకళకు సమర్థురాలైన అధికారిణిగా పేరుంది. జఠిలమైన సమస్యలను సైతం ప్రజల సహకారంతో పరిష్కరించగల దిట్ట. అందుకే ఆవిడంటే ఆ జిల్లా ప్రజలకు నమ్మకం. నిత్యం వందల సంఖ్యలో జనం ఆమె కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకుంటారు. సోమవారం కమల్ పూర్ అనే గ్రామం నుంచి కొందరు వ్యక్తులు తమ సమస్య చెప్పుకోవడానికి కలెక్టరమ్మ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ కిక్కిరిసిపోయిన జనం మధ్యలోకి వచ్చిన దరాఖాస్తులు స్వీకరిస్తున్న చంద్రకళకు ఊహించని పరిణామం ఎదురైంది.

18 ఏళ్ల అహ్మద్ అనే యువకుడు చంద్రకళకు అతిసమీపంగా వెళ్లి తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకున్నాడు. యువకుడి చర్యతో ఇబ్బందిపడ్డ ఆమె.. సెల్ఫీని డిలీట్ చేయాలని మర్యాదగా అడిగింది. కలెక్టరమ్మ చెప్పింది వినకపోగా, 'ఎందుకు చేయాలి? నా ఫోన్ నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి?' అని ఎదురుదాడి చేశాడు అహ్మద్. అంతే, కోపం పట్టలేక 'వీణ్ని లాకప్ లో పడేయండి' అని పోలీసులను ఆదేశించింది. అహ్మద్ పై సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు ఆదేశాలప్రకారం జైలుకు పంపారు.

'మొబైల్ మీదే కావచ్చు. కానీ ఫొటో తీసేది నన్నే అయినప్పుడు నేను కచ్చితంగా అడ్డుచెబుతా. నన్ను ఇబ్బందికిగురిచేసే చర్యను అడ్డుకోవడం నా హక్కు కూడా. అయినా నా పర్మిషన్ లేకుండా నాతో ఫొటో ఏంటి? పైగా డిలీట్ చేయమన్నప్పుడు ఆ యువకుడు ప్రవర్తించిన తీరు మరీ దారుణం. అందుకే బుద్ధి చెప్పాలనుకున్నా' అని తన చర్యను సమర్థించుకుంటూ విలేకరులకు వివరణ ఇచ్చింది డీఎం చంద్రకళ.

మరిన్ని వార్తలు