‘సీతారామ’కు అటవీ అనుమతులివ్వండి

7 Feb, 2018 02:46 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల, టీఆర్‌ఎస్‌ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన వైల్డ్‌ లైఫ్‌ అనుమతుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు తుమ్మల, టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు.

ప్రాజెక్టుకు అవసరమైన మొదటి దశ అనుమతులు వచ్చాయని, వైల్డ్‌ లైఫ్‌ అనుమతుల మంజూరుకు సంబంధించి వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు తుమ్మల మీడియాకు తెలిపారు. అనంతరం తుమ్మల కేంద్ర మంత్రి గడ్కరీని కలసి తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలోని 3 వేల కి.మీ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించడంపై గెజిట్‌ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు