బిడ్డ కోసం 1,500 కి.మీ.

3 Dec, 2017 01:54 IST|Sakshi

సైకిల్‌పై ఊరూరా వెతుకుతున్న పేద రైతు

ఆగ్రా:  కనిపించకుండాపోయిన కొడుకు కోసం ఓ నిరుపేద రైతు సైకిల్‌పై ఊరూరా తిరుగుతున్నాడు. వెతుకుతూ 1,500 కి.మీ. తిరిగాడు. ఇంకా తిరుగుతున్నాడు. యూపీలోని హథారస్‌ జిల్లా ద్వారికాపూర్‌లో  48 ఏళ్ల సతీశ్‌ చంద్‌ కొడుకు గోడ్నా జూన్‌ 24న స్కూలుకెళ్లి∙ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బందిని అడిగితే సమాధానం లేదు. స్నేహితుల్ని అడిగితే స్థానిక రైల్వే స్టేషన్‌ దగ్గర చూశామన్నారు. అక్కడా దొరకలేదు. దాంతో అప్పటి నుంచి 11ఏళ్ల కొడుకుకోసం వెతుకుతూనే ఉన్నాడు. ఢిల్లీ, హరియాణాల్లోని చాలాచోట్ల తిరిగాడు. ఐదు నెలలుగా వెతుకులాడుతూ ఆగ్రా సమీపంలోని ఎత్మద్‌పూర్‌ చేరుకున్నాడు.

‘జూన్‌లో పోలీస్‌ స్టేషన్‌కు  వెళ్తే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. బతిమాలిన తర్వాత తీసుకున్నారు. వారేదో చేస్తారని నేను వేచి చూస్తే గోడ్నా నాకు దక్కడని అర్థమైంది. దీంతో నేనే వెతుకులాట సాగించాను. సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన వారినల్లా ‘ఈ ఫొటోలో అబ్బాయిని ఎక్కడైనా చూశారా’ అని అడుగుతున్నాను. నా దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంది. నాకెవరూ తెలియదు. నా లాంటి వాళ్లకు ఎవరు సహాయం చేస్తారు’’ అంటూ ఆవేదన చెందాడు. ఇప్పటివరకు 1,500 కిలోమీటర్ల మేర తిరిగానని, గోడ్నా జాడ తెలియరాలేదని చెప్పాడు. వందలాది గ్రామాల్లో తిరిగి, వేలాది మందిని అడిగానని తెలిపాడు.

బాలల హక్కుల కార్యకర్త చొరవ
చిరునవ్వులొలికిస్తున్న ఓ బాలుడి ఫొటో పట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ.. అలసిపోయి, ఆకలితో, నిరాశలో కూరుకుపోయిన ఆ తండ్రి రోదన స్థానిక బాలల హక్కుల కార్యకర్త నరేశ్‌ పరాస్‌ వరకు వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ట్వీటర్‌ ద్వారా యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రానికల్లా వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. అలాగే యూపీ ముఖ్యమంత్రి ప్రారంభించిన జన్‌సున్‌వాయ్‌ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేశారు.

‘నా పెద్ద కూతురు సరిత 2005లో అనారోగ్యంతో చనిపోయింది. 2011లో జరిగిన ప్రమాదంలో 9 ఏళ్ల కొడుకును కోల్పోయాను. గోడ్నా లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదు’ అని వాపోయాడు. కరపత్రాలు పంచుతున్నానని, తిరిగిన ప్రతి చోట, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద చాయ్‌వాలాలు, దుకాణదారుల నంబర్లు తీసుకున్నానని చెబుతున్నాడు. తన కొడుకు కోసం వేయి కళ్లతో వెతుకుతూనే ఉంటానని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు.

మరిన్ని వార్తలు