నానోస్కోప్‌కు నోబెల్

9 Oct, 2014 02:21 IST|Sakshi
నానోస్కోప్‌కు నోబెల్

ఇద్దరు అమెరికన్‌లు, ఒక జర్మన్ శాస్త్రవేత్తకు పురస్కారం
మీటరులో వంద కోట్ల వంతు అణువులనూ చూసేలా ఆప్టికల్
మైక్రోస్కోపును అభివృద్ధిపర్చిన శాస్త్రవేత్తలు

 
స్టాక్‌హోం(స్వీడన్): అతిచిన్న అణువులను సైతం కోట్ల రెట్లు పెద్దగా చేసి చూపించే సూక్ష్మదర్శినికి మరింత లోతైన ‘దృష్టి’ని ఇచ్చిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది రసాయన నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్‌జిగ్(54), విలియం మోర్నర్(61), జర్మన్ శాస్త్రవేత్త స్టెఫాన్ హెల్(51)లను బుధవారం రసాయన శాస్త్ర విభాగంలో విజేతలుగా నోబెల్ కమిటీ ప్రకటించింది. ఎరిక్ బెట్‌జిగ్ వ ర్జీనియాలోని హోవార్డ్ హగ్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో, మోర్నర్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్‌గా హెల్  కొనసాగుతున్నారు. సైన్స్ పరిశోధనల్లో ఎంతో కీలకమైన ఆప్టికల్ మైక్రోస్కోపును నానోస్కోపుగా మార్చేందుకు వీరి ఆవిష్కరణలు దోహదపడ్డాయని నోబెల్ కమిటీ పేర్కొంది. నానోస్థాయిలో ఒక మీటరులో వంద కోట్ల సైజు మాత్రమే ఉన్న ప్రొటీన్ అణువులను సైతం అధ్యయనం చేసేందుకు వీరి పరిశోధనలు మార్గం చూపాయని కమిటీ ప్రశంసించింది. ముగ్గురు విజేతలకు కలిపి మొత్తం 6.78కోట్ల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి, సోమవారం ఆర్థిక విభాగాల్లో నోబెల్ ప్రకటిస్తారు.

ఏమిటీ ఆప్టికల్ మైక్రోస్కోపు?

వస్తువులపై కాంతిని ప్రసరింపచేసి వాటిని పెద్దగా చూపించే సూక్ష్మదర్శినులను ఆప్టికల్ మైక్రోస్కోపులుగా పిలుస్తారు. కాంతి తరంగాలు వస్తువులపై పడినప్పుడు వాటికి అవరోధం కలుగుతుంది. దీని ఆధారంగానే ఈ సూక్ష్మదర్శినులు ఆ వస్తువులను గుర్తిస్తాయి. అయితే.. కాంతి తరంగదైర్ఘ్యంలో సగం కన్నా తక్కువ సైజులో ఉన్న వస్తువులను అంటే.. 0.2 మైక్రోమీటర్ల సైజు కన్నా తక్కువగా ఉండే అణువులను ఆప్టికల్ మైక్రోస్కోపులతో చూడటం ఎప్పటికీ సాధ్యం కాదని భావించేవారు. 1873లో ఎర్నెస్ట్ ఎబ్ అనే శాస్త్రవేత్త ఈ పరిమితికి సంబంధించి ఓ సిద్ధాంతమూ ప్రతిపాదించారు. దీంతో నాడీకణాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి అతి సూక్ష్మకణాల లోపలి అణువులను, వాటి చర్యలను చూడటం సాధ్యం కాలే దు. వీటికన్నా శక్తిమంతమైన ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినులు వచ్చినా.. సజీవ కణాలను అధ్యయనం చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో.. సజీవ కణాల లోగుట్టును తేల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన ఎరిక్, మోర్నర్, హెల్‌లు ఆప్టికల్ మైక్రోస్కోపులను మరింత శక్తిమంతంగా మార్చేందుకు ఉపయోగపడే రెండు కొత్త పద్ధతులను ఆవిష్కరించారు.


 ఇవీ ఆవిష్కరణలు: ఆప్టికల్ మైక్రోస్కోపు సామర్థ్యం పెంచేందుకు హెల్.. 2000 సంవత్సరంలో ‘స్టిమ్యులేటెడ్ ఎమిషన్ డిప్లిషన్(స్టెడ్) మైక్రోస్కోపీ’ పద్ధతిని ఆవిష్కరించారు. ఇందు లో 2 లేజర్ కాంతి పుంజాలను ఉపయోగించా రు. ఒక కాంతిపుంజం అణువులు కాంతిని ప్రతి బింబించేలా ప్రేరేపించగా ఇంకో కాంతి పుంజం నానోమీటరు సైజు కన్నా పెద్ద సైజు అణువులు కాంతిని ప్రతిబింబించకుండా అడ్డుకుంది. దీంతో వీటిని స్కాన్ చేసి, వచ్చిన చిత్రాన్ని అభివృద్ధిపర్చగా.. అత్యంత నాణ్యమైన చిత్రాలు వచ్చాయి. అలాగే.. బెట్‌జిగ్, మోర్నర్‌లు వేర్వేరుగానే ‘సింగిల్-మాలిక్యుల్ మైక్రోస్కోపీ’కి 2006లో బీజం వేశారు. ఈ పద్ధతిలో వీరు కాంతిని ప్రతిబింబించే అణువులు తమంతట తామే ఆన్, ఆఫ్ అయ్యేలా చేశారు. ప్రతిసారీ కొన్ని అణువులు మాత్రమే కాంతితో వెలిగేలా చేసి చిత్రాలు తీయడం ద్వారా నానోస్థాయి చిత్రాలను రూపొందించగలిగారు. దీంతో 0.2 మైక్రోమీటర్లు(ఒక మైక్రో మీటరు అంటే మీటరులో పది లక్షల వంతు) మాత్రమే కాదు.. ఏకంగా ఒక నానోమీటరు(మీటరులో 100 కోట్ల వంతు) సైజు ఉన్న అణువులనూ అధ్యయనం చేసేందుకు వీలు ఏర్పడింది. దీంతో ఈ రెండు పద్ధతుల వల్ల నానోస్కోపీ రంగంలో 15 ఏళ్లలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెదడు, శరీర కణాల లోగుట్టును తెలుసుకుని అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇతర అనేక వ్యాధుల చికిత్సలు కనుగొనేందుకు, జీవశాస్త్రంలో మరిం త అవగాహనకు ప్రస్తుతం అవకాశం ఏర్పడింది.  
 
నోబెల్ శాంతి బహుమతి రేసులో పోప్, స్నోడెన్
 
శుక్రవారం ప్రకటించనున్న నోబెల్ శాంతి బహుమతిని పోప్ ఫ్రాన్సిస్, ఎడ్వర్డ్ స్నోడెన్‌లు గెలుచుకునే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అయిన స్నోడెన్ ఆ దేశ రహస్య పత్రాలను లీక్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతనెలలో ప్రకటించిన ప్రత్యామ్నాయ నోబెల్ శాంతి బహుమతి సంయుక్త విజేతల్లో స్నోడెన్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన బాలల  హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కూడా నోబెల్ శాంతి బహుమతి విజేతగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు